బీజేపీ అగ్రనేత అద్వానీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. 97 సంవత్సరాల అద్వానీ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. రెండు రోజుల కిందటే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.
1927 సంవత్సరంలో పాకిస్థాన్‌లోని కరాచీలో అద్వానీ జన్మించారు. వాజ్‌పేయితో కలసి బీజేపీ పార్టీకి జీవం పోశారు. బీజేపీని 2 సీట్ల నుంచి అధికారంలోకి తీసుకురావడంలో అద్వానీ కీలక పాత్ర పోషించారు. దేశ వ్యాప్తంగా అద్వానీ చేసిన రథయాత్ర చరిత్రలో నిలిచిపోయింది. ఉప ప్రధాని సహా అనేక పదవుల ద్వారా నిజాయితీగా సేవలు అందించిన అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారత రత్న పురస్కారంతో సత్కరించింది.