విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్లను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భాగవత్ దర్శించుకన్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా విజయవాడలో పర్యటిస్తున్న మోహన్ భాగవత్ నేడు అమ్మవారిని దర్శించుకుని వేదపండితులు ఆశీర్వచనం తీసుకున్నారు.
ఇంద్రకీలాద్రికి వచ్చిన మోహన్ భాగవత్ కు దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులు, ఈవో కేఎస్ రామారావు, ఆలయ సిబ్బంది, వేదపండితులు ఘనస్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేదపండితులు ఆశీర్వచనం అందజేయగా, దేవాదాయ శాఖ, ఆలయ అధికారులు మోహన్ భాగవత్ కు ప్రసాదం, చిత్రపటం, శేషవస్త్రం అందజేశారు.
అనంతరం ఆలయ సిబ్బంది ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న అభివృద్ధి పనులు వివరించారు. డిసెంబర్ 21 నుంచి 25 వరకు జరుగే భవానీ దీక్ష విరమణల కోసం పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భవానీదీక్షల కోసం ఏర్పాటు చేసిన మొబైల్ యాప్ ను మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆవిష్కరించారు. భక్తులంతా bhavani deeksha 2024 యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని సేవలు వినియోగించుకోవాలని కోరారు.