పంజాబీ గాయకుడు రణజీత్ బావా హిమాచల్ ప్రదేశ్ కార్యక్రమం రద్దయింది. తన పాటల్లో హిందూ దేవీదేవతలను అవమానించేలా ఆలపించే రణజీత్ బావాకు వ్యతిరేకంగా హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేసాయి. దాంతో రేపు ఆదివారం నాలాగఢ్‌లో జరగవలసిన కార్యక్రమాన్ని రద్దు చేసారు.
రణజీత్ బావా కార్యక్రమానికి వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు ఈ వారం మొదట్లో నిరసన చేపట్టారు. షోను రద్దు చేయాలంటూ అధికార యంత్రాంగానికి మెమొరాండం అందజేసారు. రణజీత్ బావా తన చర్యల ద్వారా హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాడంటూ వారు ఆరోపించారు.
హిమాచల్ ప్రదేశ్ సోలన్ జిల్లాలోని నాలాగఢ్‌లో ఈ వారాంతంలో జిల్లాస్థాయి రెడ్‌క్రాస్ ఫెయిర్ జరుగుతోంది. 13, 14, 15 తేదీల్లో జరిగే ఆ కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనల్లో భాగంగా ఆదివారం రాత్రి రణజీత్ బావా షో ఏర్పాటు చేసారు. అయితే హిందూ సంఘాల డిమాండ్లకు ఒప్పుకుని నిర్వాహకులు ఆ కార్యక్రమాన్ని రద్దు చేసారు.
రణజీత్ బావా పాటల్లో హిందూ దేవతలను అవమానించేలా వాక్యాలు ఉన్నాయి. ప్రత్యేకించి ‘మేరా క్యా కసూర్’ అన్న పాట హిందువుల మనోభావాలను దెబ్బతీసింది. కులవివక్షను వ్యతిరేకించడం పేరిట హిందువులను కులపిచ్చిగాళ్ళంటూ రణజీత్ బావా ముద్రవేసాడు.
రణజీత్ బావా ‘తూఫాన్ సింగ్’ అనే పంజాబీ సినిమాలోనూ ప్రధాన పాత్రలో నటించాడు. ఆ చిత్రాన్ని సెన్సార్ బోర్డ్ సర్టిఫై చేయనందున ఆ సినిమా భారతదేశంలో విడుదల అవలేదు. ఖలిస్తానీ ఉగ్రవాది తూఫాన్ సింగ్ కథ ఆధారంగా తీసిన ఆ సినిమాలో ఉగ్రవాదులను హీరోలుగా చూపించారు.