ఢిల్లీ హైకోర్టు నిన్న శుక్రవారం ఒక విచిత్రమైన కేసు కొట్టేసింది. ఎర్రకోట మా సొంతం, దాన్ని మాకు తిరిగి ఇచ్చేయాలంటూ మొగల్ నవాబుల వారసురాలు వేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.
ఆఖరి మొగల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ 2 మునిమనవడి భార్య సుల్తానా బేగమ్. ఎర్రకోటకు అసలైన వారసురాలిని తనే అని, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1857లో బలవంతంగా తమ పూర్వీకుల నుంచి ఆ కోటను లాగేసుకుందని, ఇప్పుడు భారత ప్రభుత్వం ఆ కోటను అక్రమంగా ఆక్రమించిందనీ సుల్తానా బేగమ్ వాదన. తన కోటను తనకు ఇప్పించాలనీ, లేనిపక్షంలో కనీసం నష్టపరిహారం చెల్లించేలా ఆదేశించాలనీ ఢిల్లీ హైకోర్టులో సుల్తానా పిటిషన్ వేసింది.
మొదట, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఆ పిటిషన్‌కు కాలదోషం పట్టిందంటూ కొట్టేసారు. ఎప్పుడో 167ఏళ్ళ క్రితం చేతులు మారిన కోటను ఇప్పుడు తిరిగి ఇవ్వడం కుదరదని స్పష్టం చేసారు. ఆమేరకు 2021 డిసెంబర్‌లో సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. ఆ తీర్పును సవాల్ చేస్తూ ఈమధ్య సుల్తానా బేగమ్ మళ్ళీ హైకోర్టులో అప్పీలు చేసుకున్నారు.
ప్రధాన న్యాయమూర్తి విభూ భాక్రూ, జస్టిస్ గేదెల తుషార్ రావులతో కూడిన డివిజన్ బెంచ్ తాజా పిటిషన్‌ను సైతం డిస్మిస్ చేసారు. తాజా పిటిషన్ సైతం రెండున్నరేళ్ళు ఆలస్యంగా దాఖలు చేసారన్న కారణంతో సుల్తానా ఇటీవల చేసుకున్న అప్పీలును కొట్టేసారు.
సుల్తానా తరఫున కేసు పెట్టిన అడ్వొకేట్ వివేక్ మోరే తన వాదనల్లో భాగంగా భారత ప్రభుత్వం ఎర్రకోటను అక్రమంగా ఆక్రమించిందని ఆరోపించారు. 1857 నుంచి ఇప్పటివరకూ అక్రమ ఆక్రమణకు భారత ప్రభుత్వంతో నష్టపరిహారం ఇప్పించాలని సుల్తానా హైకోర్టును కోరారు.
ఎర్రకోటను మొగల్ రాజు షాజహాన్ నిర్మింపజేసాడు. దేశ రాజధానిని ఆగ్రా నుంచి ఢిల్లీకి మార్చినపుడు ఆ కోట నిర్మాణం జరిగింది. నాదిర్‌షా ఆక్రమణ సమయంలో ఎర్రకోటలోని నెమలి సింహాసనం సహా అమూల్యమైన కళాఖండాలు, అద్భుతమైన ఆభరణాలూ దేశం వదిలి తరలిపోయాయి. 1857 ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం తర్వాత బ్రిటిష్ పాలకులు ఎర్రకోటను సైనిక స్థావరంగా వాడుకున్నారు. వారు ఎర్రకోటలోని 80శాతానికి పైగా నిర్మాణాలను, మొత్తం ఫర్నిచర్‌నూ తొలగించివేసారు. సైన్యం కోసం రాళ్ళతో బ్యారక్‌లు కట్టారు. కోటలోని ఫర్నిచర్‌ను, కళాఖండాలనూ ఇంగ్లండ్ తరలించివేసారు.
దేశానికి స్వతంత్రం వచ్చాక కూడా ఎర్రకోటను మిలటరీ బేస్‌గానే ఉపయోగించారు. 2003లో వాజ్‌పేయీ హయాంలో ఎర్రకోట పునరుద్ధరణ, పరిరక్షణ బాధ్యతలను భారత పురావస్తు సంర్వేక్షణ సంస్థకు (ఎఎస్ఐ) అప్పగించారు.