నటుడు అల్లు అర్జున్ చంచల్‌గూడ జైలు నుంచి విడుదల అయ్యారు. సంధ్య థియోటర్‌లో జరిగిన తొక్కసలాటలో మహిళ చనిపోవడంపై నమోదైన కేసులో ఆయనకు తెలంగాణ హైకోర్టు శనివారం సాయంత్రం మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే అందుకు సంబంధించిన కాపీలు చంచల్‌గూడ జైలు అధికారులకు రాత్రి 10 గంటల 30 నిమిషాలకు చేరాయి. ఆ సమయంలో నిందితుల విడుదలకు నిబంధనలు సహకరించకపోవడంతో ఇవాళ ఉదయం 6 గంటల 45 నిమిషాలకు విడుదల చేశారు.
అల్లు అర్జున్ జైలు నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయం చేరుకుని అక్కడ మీడియాతో మాట్లాడారు. తనకు సహకరించిన అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపారు.తొక్కసలాటలో రేవతి మరణంపై సానుభూతి తెలిపారు. వారి కుటుంబానికి అండగా నిలుస్తానని చెప్పారు. అరెస్ట్ వెనకాల రాజకీయ శక్తులు ఏమైనా పనిచేశాయా అంటూ మీడియా అడిగిన ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానాలు చెప్పకుండానే వెనుతిరిగారు.
అల్లు అర్జున్ విడుదలతో ఆయన అభిమానులు దేశ వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. అల్లు అర్జున్ జైలు నుంచి హైదారబాద్‌లోని జూబ్లిహిల్స్ నివాసం చేరుకోగానే అక్కడ కుటుంబసభ్యులు ఆలింగనం చేసుకున్నారు. అభిమానులు పెద్ద ఎత్తున ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు.దీంతో ఆ ప్రాంతం జనసందోహంతో నిండిపోయింది.