నేటికి సరిగ్గా 23ఏళ్ళ క్రితం, అంటే 2001 డిసెంబర్ 13న ఐదుగురు ఉగ్రవాదులు భారత పార్లమెంటుపై దాడి చేసారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తయ్యబా, జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థల కుట్ర ఫలితంగా జరిగిన ఆ దాడిలో 9మంది ప్రాణాలు కోల్పోయారు, 18మంది గాయపడ్డారు.
ఉగ్రవాదులు ఎకె-47 రైఫిల్స్, గ్రెనేడ్స్, గ్రెనేడ్ లాంచర్స్, హ్యాండ్గన్స్తో పార్లమెంటు ఆవరణలోకి చొరబడ్డారు. ఒక తెల్లటి అంబాసిడర్ కారు మీద హోంశాఖ నకిలీ స్టిక్కర్లు అంటించడం ద్వారా సెక్యూరిటీ తనిఖీలను తప్పించుకుని లోపలికి చేరుకున్నారు. ఆ క్రమంలో ప్రమాదవశాత్తు ఉపరాష్ట్రపతి వాహనశ్రేణిలోని ఒక వాహనాన్ని గుద్దేసారు కూడా.
పార్లమెంటు ఆవరణలోకి చేరుకుంటూనే ఉగ్రవాదులు ఫైరింగ్ ఓపెన్ చేసారు. సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కమలేష్ కుమారిని చంపేసారు. ఆ సమయంలో పార్లమెంటులో ఉన్న ఎంపీలు మాత్రం సురక్షితంగా తప్పించుకోగలిగారు. దుండగుల్లో ఒకడు సూసైడ్ వెస్ట్ ధరించి ఉన్నాడు. భద్రతా బలగాలు తనను కాలుస్తుంటే అతను ఆత్మాహుతి దాడి చేసి, చచ్చిపోయాడు. మరో నలుగురు ఉగ్రవాదులను కూడా భద్రతా బలగాలు మట్టుపెట్టగలిగాయి.
పార్లమెంటు మీద ఉగ్రదాడి కేసును ఢిల్లీ పోలీస్ యాంటీ టెర్రర్ స్క్వాడ్, స్పెషల్ సెల్ దర్యాప్తు చేసాయి. ఆ కేసులో ప్రధాన నిందితులుగా అఫ్జల్ గురు, షౌకత్ హుసేన్ గురులను గుర్తించారు. 2013లో అఫ్జల్ గురుకు మరణశిక్ష పడింది. తిహార్ జైల్లో ఆ శిక్షను అమలు చేసారు.
పార్లమెంటుపై దాడి తర్వాత భారత పాకిస్తాన్ దేశాల మధ్య 2001, 2002 సంవత్సరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కశ్మీర్ లోయ ప్రాంతం అంతా ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. దాని ఫలితంగా వాస్తవాధీన రేఖ వెంబడి పెద్దసంఖ్యలో సైనిక బలగాలను మోహరించారు.
ఉగ్రవాదుల దాడిని అడ్డుకుని తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎంపీలను, పార్లమెంటునూ రక్షించిన అమరవీరులకు భారతదేశం నివాళులు అర్పిస్తోంది. 2001 గాయాల మచ్చలు ప్రజాస్వామ్యానికి ఉగ్రవాదం విసిరే సవాళ్ళను, జాతీయ భద్రతకు కఠిన చర్యలు తీసుకోవలసిన ఆవశ్యకతనూ గుర్తుచేస్తూనే ఉంటాయి.