స్వర్ణాంధ్ర విజన్- 2047.. రాష్ట్ర దశ, దిశను మారుస్తుందని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. విజయవాడలో స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, తెలుగుజాతి ప్రపంచంలోనే నంబర్ 1గా నిలవాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. నేడు 3 వేల డాలర్ల కంటే తక్కువగా తలసరి ఆదాయం ఉందన్నచంద్రబాబు, 2047 నాటికి 42 వేల డాలర్లకు తలసరి ఆదాయం పెరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో 17 లక్షల మంది భాగస్వామ్యం ఉందన్నారు. వారంతా తమ ఆలోచనలు పంచుకున్నారని తెలిపారు. సంస్కరణల ద్వారానే ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురాగలమని అభిప్రాయం వ్యక్తం చేశారు.
అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యమని వివరించిన చంద్రబాబు, పేదరికం లేని సమాజం అనేది మంత్రంగా తయారు కావాలని అభిలాషించారు. పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తూ ఉద్యోగాలిప్పించే దిశగా తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నీటి భద్రతకు ప్రాధాన్యమివ్వడంతో పాటు కరవు రహిత ఏపీకి శ్రీకారం చుడుతున్నామన్నారు. వ్యవసాయానికి సాంకేతికతను అనుసంధానించే అంశాన్ని విజన్‌లో చేర్చామని తెలిపారు.