భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ కేసులో బెంగళూరు పోలీసులు చర్యలు ప్రారంభించారు. అతుల్ భార్య, ఆమె కుటుంబసభ్యులకు మారతహళ్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. మూడు రోజుల్లో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో కోరారు.
అతుల్ సోదరుడు బికాస్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అతుల్ సుభాష్ ఉత్తరప్రదేశ్‌లోని జౌన్పూర్ నివాసి. అక్కడే ఆయన భార్య నివాసం కూడా ఉంటోంది. తాజాగా బెంగళూరు పోలీసులు అతుల్ భార్య నిఖితా సింఘానియాతోపాటు, ఆమె తల్లిదండ్రులు, మేనమామకు కూడా నోటీసులు ఇచ్చారు.
అతుల్ 2017లో నిఖితా సింఘానియాను వివాహం చేసుకున్నారు. వారికి ఓ కుమార్తె కూడా పుట్టింది. వారి మధ్య వివాదాలు నెలకొన్నాయి. అతుల్‌పై నిఖితా కేసులు పెట్టింది. కేసుల నుంచి బయటపడాలంటే రూ.3 కోట్లు ఇవ్వాలంటూ హింస పెట్టిందంటూ అతుల్ 24 పేజీల సూసైడ్ లేఖ రాశారు. ఆ తరవాత ఆయన బెంగళూరులో నివాసం ఉంటోన్న గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అతుల్ రాసిన ఆత్మహత్య లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వ్యవస్థపై తాను విజయం సాధిస్తే తన మృతదేహాన్ని గంగానదిలో కలపాలని, ఓడిపోతే కోర్టు గుమ్మానికి వేలాడదీయాలంటూ అతుల్ రాసిన లేఖ లక్షలాది టెకీల హృదయాలను కదలించి వేసింది.వారంతా అతుల్‌కు సోషల్ మీడియా వేదికగా అండగా నిలిచారు.