ఏసీపీ మహమ్మద్ మోహిసిన్ పై ఫిర్యాదు
ఓ రిసెర్చ్ స్కాలర్ పై పెళ్ళి పేరిట ఏసీపీ అత్యాచారానికి పాల్పడినట్లు కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఐఐటీ కాన్పూర్ కు చెందిన స్కాలర్, సైబర్ క్రైమ్, క్రిమినాలజీపై అధ్యయనం కోసం కాన్పూర్ ఏసీపీ మహమ్మద్ మోహిసిన్ ఖాన్ ను పలుమార్లు కలిశారు. ఆ తర్వాత పరిచయం పెరిగి ఇద్దరి మధ్య ప్రేమగా మారినట్లు పోలీసులకు బాధితురాలు తెలిపింది. పెళ్ళి చేసుకుంటానని చెప్పిన మహమ్మద్ మోహిసిన్ ఆమెను లోబరుచుకున్నారు. అనంతరం మాటమార్చాడు. ఈ విషయమై బాధితురాలు తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడిని విధుల నుంచి తప్పించిన ఉన్నతాధికారులు, అడిషనల్ డీసీపీ నేతృత్వంలో సిట్ వేశారు. తనకు మాయమాటలు చెప్పి పలుమార్లు అఘాయిత్యానికి ఒడిగట్టాడని బాధితురాలు చెబుతోంది.
పోలీసు ఉన్నతాధికారులు డీసీపీ అంకితా శర్మ, ఏడీసీపీ అర్చన సింగ్ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేశారు. విచారణ చేపట్టిన సిట్ బాధితురాలు చెబుతున్న దానిలో నిజం ఉందని తేల్చింది. ఏసీపీ పై సీపీ అఖిల్ కుమార్‌కు సిట్ సభ్యులు నివేదిక అందించారు.
ఏసీపీపై అత్యాచారం సహా తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని నివేదికలో పేర్కొన్నారు. దీంతో ఏసీపీ పై శాఖాపరమైన చర్యలు చేపట్టిన పోలీసు ఉన్నతాధికారులు అతడిని విధుల నుంచి తప్పించి డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు.