విలువైన పచ్చ కిరీటం కానుకగా సమర్పించిన భక్తుడు
తిరుచ్చి శ్రీరంగం రంగనాథర్ స్వామికి ఓ భక్తుడు విలువైన కానుక సమర్పించాడు. భరతనాట్యం కళాకారుడు జహీర్ హుస్సేన్, ఈ కానుకను స్వామికి సమర్పించారు. గరుడ పచ్చ, 600 వజ్రాలతో తయారుచేయించిన రూబీ కిరీటాన్ని ఆయన స్వామికి కానుకగా అందజేసి భక్తిని చాటుకున్నారు.
రాజస్థాన్ నుంచి తెప్పించిన మేలురకం 3,169 క్యారెట్లతో కూడిన రూబీ కిరీటాన్ని తయారు చేయించేందుకు 8 ఏళ్ళు పట్టిందని జహీర్ హుస్సేన్ తెలిపారు. గోపాల్ దాస్ అనే కళాకారుడు రూపొందించినట్లు వివరించారు. ఆలయ ప్రధాన అర్చకుడు సుందర్ భట్టర్కు కిరీటాన్ని అందజేసినట్లు తెలిపారు.
భరత నాట్య కళాకారుడైన జహీర్ హుస్సేన్, తన ప్రదర్శనల ద్వారా వచ్చిన ఆదాయంలో కొంచెం కొంచెం పొదుపు చేసి ఈ కిరీటాన్ని తయారు చేసినట్లు తెలిపారు. భారతదేశంలో ప్రసిద్ధి చెందిన 108 వైష్ణవ క్షేత్రాల్లో తిరుచ్చి ఒకటి. ఈ ఆలయ రాజగోపురం ఆసియా ఖండంలోనే అతిపెద్దదిగా రికార్డుకెక్కింది.