వచ్చే యేడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ ప్రయాగరాజ్‌లో జరగబోయే మహాకుంభమేళాకు 45 నుంచి 50 కోట్లమంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ మంత్రి రాకేష్ సచన్ వెల్లడించారు. ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మహిళా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను మహాకుంభ్‌కు ఆహ్వానించడానికి ఆయన గురువారం పట్నా వెళ్ళారు.
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇవాళ ప్రయాగరాజ్‌లో కుంభమేళా ఏర్పాట్లను సమీక్షిస్తారు. నిన్న కూడా ఆయన ప్రయాగలోనే ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనకు ముందు, మహాకుంభ్‌నగర్‌లో జరుగుతున్న ఏర్పాట్లను యోగి ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. 12 ఏళ్ళకు ఒకసారి జరిగే కుంభమేళాకు ఏడాది ముందుగా ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.
మహాకుంభమేళాకు హాజరయ్యే మహిళా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు మహాకుంభ్‌నగర్ సబ్‌కలెక్టర్ అభినవ్ పాఠక్ వెల్లడించారు. త్రివేణీసంగమం దగ్గర మహిళా భక్తుల కోసం 12 ప్రత్యేక యూనిట్లు అందుబాటులో ఉంటాయి. ఒక్కో యూనిట్ 25మీటర్ల పొడవు, 6 మీటర్ల వెడల్పు ఉంటాయి. పవిత్రస్నానం తర్వాత దుస్తులు మార్చుకోడానికి గదులు కూడా ఆ యూనిట్లలో ఉంటాయి.
త్రివేణీసంగమ క్షేత్రం దగ్గర పాత, పాడైపోయిన పడవలను తొలగించారు. వాటిస్థానంలో కొత్తగా తేలియాడే జెట్టీలు ఏర్పాటు చేసారు. వాటిని పూలతో అలంకరిస్తారు.
మహాకుంభమేళా కోసం ప్రయాగరాజ్‌లో జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఉత్తరప్రదేశ్‌లో పర్యటిస్తారు. ఆ సందర్భంగా రూ.6670 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. మోదీ ఈ మధ్యాహ్నం 12.15కు త్రివేణీసంగమంలో పూజ చేస్తారు. తర్వాత అక్షయ వటవృక్షం దగ్గర, హనుమాన్ మందిర్ దగ్గర, సరస్వతీ కూపం దగ్గర పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1.30 సమయంలో మహాకుంభ్ ఎగ్జిబిషన్ సైట్‌ను సందర్శిస్తారు.