ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రఅల్పపీడనం తీరం దాటింది. అయితే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వీటి ప్రభావంతో తమిళనాడు, ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో గడచిన 24 గంటల్లో కుండపోత వర్షాలు కురిశాయి. తిరుమలలో కొండ చరియలు విరిగిపడ్డాయి. చంద్రగిరి నియోజకవర్గంలో వరదలు ముంచెత్తుతున్నాయి. తిరుపతి, తిరుమల ప్రాంతాలు జలమయం అయ్యాయి.
తాజాగా ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో 17వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది. దక్షిణ కోస్తాకు మోస్తరు వర్షాలు, రాయలసీమలో భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. గడచిన 24 గంటల్లో తిరుమలలో అత్యధిక వర్షపాతం నమోదైంది. వర్షాలకు తేమ గాలులు తోడయ్యాయి. దీంతో చలి తీవ్రత పెరిగింది.
భారీ వర్షాలకు తిరుమలలో 5 రిజర్వాయర్లు నిండాయి. గోగర్భం, పాపవినాశనం, ఆకాశగంగ రిజర్వాయర్ల నుంచి వరద నీటిని విడుదల చేశారు. మరో 2 సంవత్సరాల వరకు తిరుమల నీటి అవసరాలకు ఇబ్బంది ఉండదని అధికారులు తెలిపారు.
తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. 3 జిల్లాల్లో రెడ్ అలర్డ్, 12 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అధికారులను అప్రమత్తం చేశారు. దక్షిణ తమిళనాడులో జనజీవనం స్థంభించిపోయింది.