దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో గతరాత్రి ‘ది సబర్మతి రిపోర్ట్’ చిత్రాన్ని ప్రదర్శిస్తున్న సమయంలో రాళ్ళదాడి చోటు చేసుకుంది. ఆ దాడి వ్యక్తుల మీద జరిగిన దాడి మాత్రమేకాదని, భావ ప్రకటనా స్వేచ్ఛ, చర్చలు, ప్రజాస్వామ్య విలువలపై జరిగిన దాడి అని ఎబివిపి మండిపడింది.
జెఎన్‌యులో ది సబర్మతి రిపోర్ట్ చిత్ర ప్రదర్శన, మన దేశపు సోకాల్డ్ మేధావివర్గం ఉద్దేశపూర్వకంగా విస్మరించి మౌనంగా వదిలేసిన అంశాలపై చర్చించి నిజాలను వెలికితీసే ప్రయత్నమని ఎబివిపి వ్యాఖ్యానించింది. ‘చర్చ జరగాల్సిన చోట రాళ్ళదాడి చేయడం విశ్వవిద్యాలయంలోని భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక శక్తుల అభద్రతా భావాన్ని, అసహనాన్నీ ప్రతిబింబిస్తోంది. సత్యం, ధర్మం, న్యాయం పునరుద్ధరించబడతాయనే భయం ఉన్న అటువంటి ప్రతీపశక్తులు మోసపూరితమైన తప్పుడు ప్రచారాల మీద ఆధారపడుతున్నాయి. భారతదేశపు సాంస్కృతిక, ఆధ్యాత్మిక స్వరూపాన్ని నాశనం చేయాలనే తప్పుడు దృక్పథం కలిగిన సోకాల్డ్ ఉదారవాదులు తమ అజెండాను సవాల్ చేసే, తమ అబద్ధాలను బైటపెట్టే ఎలాంటి గొంతుకయినా లేవడాన్ని సహించలేరు. ఆ శక్తులే వేర్పాటువాద భావజాలాలను బహిరంగంగా సమర్ధిస్తారు, జాతి వ్యతిరేక నినాదాలను గొప్పవిగా ప్రచారం చేస్తారు, భారతదేశపు సాంస్కృతిక ఐక్యతను బలపరిచే ఏ చర్యనైనా సమర్ధిస్తారు’ అని ఎబివిపి జెఎన్‌యు విభాగం ఒక ప్రకటనలో పేర్కొంది.
సమైక్యమూ, సమృద్ధమూ అయిన భారతదేశాన్ని సాధించేందుకు ఆలోచన, చర్చ, కార్యాచరణ పట్ల యువతకు ప్రేరణ కల్గించే కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఉంటామని ఎబివిపి జెఎన్‌యు శాఖ ప్రకటించింది. దేశవ్యతిరేక, అధర్మ, జాతి విచ్ఛిన్న శక్తులపై కలసికట్టుగా పోరాడి ఓడించాల్సి ఉందని పిలుపునిచ్చింది.
‘ది సబర్మతి రిపోర్ట్’ ప్రదర్శనకు వందల సంఖ్యలో విద్యార్ధులు హాజరయ్యారు. చలనచిత్రంలోని అంశంపై కుతూహలం వ్యక్తమైంది. విద్యార్ధులు భావస్ఫోరకమైన చర్చలు జరిపారు. చిత్రప్రదర్శన తర్వాత ఇంటరాక్టివ్ సెషన్ జరిగింది. విద్యార్ధులు తమతమ వ్యాఖ్యానాలతో చిత్ర సందేశం గురించి చర్చించారు.