ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ విజేతగా భారతీయుడు దొమ్మరాజు గుకేష్ సంచలనం సృష్టించాడు. అతి చిన్న వయసులో వరల్డ్ చెస్ ఛాంపియన్‌గా గుకేష్ రికార్డు నెలకొల్పాడు. సింగపూర్ వేదికగా జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ పోటీల్లో లిరెన్‌ను ఓడించి గుకేష్ విశ్వవిజేతగా నిలిచాడు విశ్వనాథన్ ఆనంద్ తరవాత రెండో భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు.
వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేష్‌కు ట్రోఫీతో పాటు రూ.11.45 కోట్ల నగదు బహుమతి అందించారు. రన్నరప్ లిరెన్ రూ.9.75 కోట్లు అందుకున్నాడు. 2017లో కార్ల్‌సన్ ప్రపంచ చెస్ విజేతగా గెలిచినప్పుడే తాను విశ్వవిజేత కావాలని నిర్ణయించుకున్నట్లు గుకేష్ చెప్పారు. మొదటి రౌండ్లో ఓడినా, తనకు ఇంకా 13 రౌండ్లు మిగిలి ఉన్నాయని కోచ్ ఇచ్చిన అండతో ముందుకు సాగినట్లు చెప్పారు. ప్రపంచ చెస్ ఛాంపియన్ గెలిచినంత మాత్రాన, తానే అత్యుత్తమ ఆటగాడిని కాదని తెలిపారు. కెరీర్ ఇప్పుడే ప్రారంభం అయిందని, కార్ల్‌సన్ అత్యుత్తమ ఆటగాడని కొనియాడారు.
గుకేష్ విజయంపై ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ చెస్ క్రీడలో భారత సత్తా చాటినందుకు గుకేష్‌ను పలువురు ప్రముఖులు అభినందించారు.