ఉగ్రవాద ప్రచారం, ప్రజలను రెచ్చగొట్టడం, విదేశీ నిధులు, మనీలాండరింగ్ వంటి కేసుల్లో నిందితుడైన ఒక వ్యక్తిని పట్టుకోడానికి ప్రయత్నించిన ఎన్ఐఎ బృందాన్ని ముస్లిం మూక అడ్డుకున్న సంఘటన ఉత్తరప్రదేశ్ ఝాన్సీ జిల్లాలో చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో సైతం మసీదు నుంచి పిలుపునివ్వడం ఆలస్యం, ముస్లిములు పెద్దసంఖ్యలో గుమిగూడి నిందితుణ్ణి విడిపించుకుని వెళ్ళిపోయారు.
గత అర్ధరాత్రి దాటాక 2.30 గంటల సమయంలో ఝాన్సీ కొత్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సలీంబాగ్ అలీ గోల్ ఖిడ్కీ దగ్గరున్న ముఫ్తీ ఖలీద్ అన్సారీ నద్వీ ఇంటికి ఎన్ఐఎ, ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారులు చేరుకున్నారు. విదేశాల నుంచి నిధుల సమీకరణ, మనీ లాండరింగ్ కేసుల్లో ముఫ్తీ నద్వీ నిందితుడు. అలాగే ఉగ్రవాదాన్ని ప్రచారం చేయడం, ముస్లిం యువకులను రెచ్చగొట్టడం, జైష్-ఎ-మొహమ్మద్ సంస్థకు అనుకూలంగా వారిని తయారుచేయడం వంటి ఆరోపణలతో నమోదైన కేసులోనూ అతనిపై విచారణ జరుగుతోంది. అధికారులు అతన్ని తదుపరి విచారణ కోసం తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుండగా ఆ ప్రాంతంలోని ముస్లిములు పెద్దసంఖ్యలో ఎన్ఐఎ, యూపీ-ఏటీఎస్ అధికారులను చుట్టుముట్టిచ నద్వీని విడిపించుకుని పోయారు.
ముఫ్తీ ఖలీద్ అన్సారీ నద్వీ, ఝాన్సీ నగరంలో కాజీగా పనిచేస్తున్న సబీర్ అన్సారీ మేనల్లుడు. అతన్ని అదుపులోకి తీసుకోడానికి ప్రయత్నిస్తున్నారన్న వార్త తెలియగానే కాజీ మద్దతుదారులు ఆందోళన మొదలుపెట్టారు. మొదట ఇన్వెస్టిగేటింగ్ టీమ్ నద్వీని సుమారు ఎనిమిది గంటల పాటు ప్రశ్నించింది. తర్వాత అతన్ని తమతో తీసుకువెళ్ళడానికి ప్రయత్నించింది. ఆ విషయాన్ని స్థానిక మసీదులోనుంచి ప్రకటించారు. దాంతో స్థానికంగా ఉన్న ముస్లిములు అందరూ అక్కడికి చేరుకున్నారు. వందల సంఖ్యలో స్త్రీపురుషులు నద్వీ ఇంటి దగ్గరకు వెళ్ళిపోయారు. పోలీసులు, ఎన్ఐఎ అధికారుల వాహనాలను చుట్టుముట్టి, వాటిలోనుంచి నద్వీని బలవంతంగా బైటకు లాక్కొచ్చేసారు.
క్షణక్షణానికీ ముస్లిముల మంద పెరిగిపోవడంతో పరిస్థితి దారుణంగా క్షీణించింది. ఎన్ఐఎ అధికారులు వారికి సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. ముస్లిం మూక అధికారులతో వాగ్వాదానికి దిగారు, కొంతమంది మరింత రెచ్చిపోయారు. సుమారు 200మంది ముస్లిములు చుట్టుముట్టి, నద్వీని తప్పించగలిగారు. ఎన్ఐఎ బృందం ఆ మూకను చెదరగొట్టడానికి, వారిని తరమడానికీ ప్రయత్నించింది కానీ ముస్లిములు తమ పనిని విజయవంతంగా పూర్తిచేసుకున్నారు.
ముఫ్తీ ఖలీద్ అన్సారీ నద్వీ ముస్లిం పిల్లలకు ఆన్‌లైన్‌లో వర్చువల్ పాఠాలు చెబుతుంటాడు. అతని తరగతులకు భారతదేశం నుంచే కాక విదేశాలలోని ముస్లిం పిల్లలు కూడా హాజరవుతుంటారు. ఎన్ఐఎకు అతని విదేశీ సోర్సుల గురించి, అతని విదేశీ సంబంధాల గురించి, దేశం బైటనుంచి అతనికి వచ్చే ఆర్థిక సహాయం గురించీ సమాచారం అందింది.
ముఫ్తీ నద్వీ తాను అమాయకుడినని చెబుతున్నాడు. తాను ఆన్‌లైన్‌లో కురాన్ తరగతులు తీసుకుంటూ ఉంటానని, ప్రపంచంలోని అన్నిదేశాల పిల్లలకూ నేర్పిస్తానని చెబుతున్నాడు. నద్వీని అనవసరంగా వేధిస్తున్నారంటూ స్థానిక ముస్లింలు ఎన్ఐఎ పైనా, యూపీ ఏటీఎస్ పైనా మండిపడుతున్నారు. అయితే ఎన్ఐఎ అధికారులు నద్వీ ఇంటిని సోదా చేసినప్పుడు పలు డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలూ స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరీక్షల కోసం ఢిల్లీ పంపించారు.