ఉద్యోగుల భవిష్య నిధిని ఏటీఎంల ద్వారా తీసుకునే ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని ఈపీఎఫ్ఓ తెలిపింది. వచ్చే ఏడాది నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా ఇప్పటి వరకు నిధులు విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఉంది. అయితే క్లెయిమ్‌ల పరిష్కారానికి 2 వారాలకుపైగా సమయం పడుతోంది. నూతన విధానం అందుబాటులోకి వస్తే పీఎఫ్ ఉపసంహరణ మరింత సులభం కానుంది.
పీఎఫ్ నిధిలో 90 శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు. అయితే అత్యవసర సమయాల్లో అందుకు అవసరమైన ధువపత్రాలు సమర్పించిన వారికి మాత్రమే ఈ సదుపాయం ఉంది. వైద్య ఖర్చులు, ఇంటి నిర్మాణం, వివాహ ఖర్చుల వంటి వాటికి 90 శాతం పీఎఫ్ ఉపసంహరించుకోవచ్చు. ఇక సాధారణ ఖర్చుల నిమిత్తం 50 శాతం వరకు ఎలాంటి ఆంక్షలు లేకుండా నగదు ఉపసంహరించుకోవచ్చు.
ప్రస్తుతం ఆన్లైన్ విధానంతోపాటు, పీఎఫ్ సంస్థ డెబిట్ కార్డులు ఇవ్వనుంది. ఇప్పటికే బ్యాంకు ఖాతాలు ఉన్నవారికి ఆ బ్యాంకు డెబిట్ కార్డు ద్వారా కూడా పీఎఫ్ నిధులు తీసుకునే సదుపాయం అందుబాటులోకి రాబోతోందని తెలుస్తోంది. అయితే దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
ప్రస్తుతం దేశంలో 15 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులు ఉన్నారు. వారందరికీ యూఏఎన్ కేటాయించారు. అనేక సంస్థల్లో ఉద్యోగం చేసినా ఒకే నంబరు కొనసాగిస్తారు. ఉద్యోగం మారినప్రతిసారి పీఎఫ్ ఖాతా మార్చాల్సిన అవసరం లేదు. సులువుగా డెబిట్ కార్డుల ద్వారా పీఎఫ్ నిధుల ఉపసంహరణకు అవకాశం కల్పిస్తే, అత్యవసర నిధి దుర్వినియోగం అయ్యే ప్రమాదముందని కొందరు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.