కేంద్ర మంత్రివర్గం జమిలి ఎన్నికల బిల్లును ఆమోదించింది. దేశమంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా రూపొందించిన ఆ బిల్లుపై కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసిందని సమాచారం. ఆ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకురావడానికి వీలుగా సమగ్రమైన బిల్లును రూపొందిస్తారని తెలుస్తోంది.
జమిలి ఎన్నికల విషయం గురించి కేంద్రం నియమించిన కమిటీకి చైర్మన్ అయిన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇదే విషయం గురించి బుధవారం మాట్లాడారు. జమిలి ఎన్నికల కోసం ఏకాభిప్రాయాన్ని సాధించాలని ఆయన సూచించారు. జమిలి ఎన్నికలు అనే అంశం రాజకీయ ప్రయోజనాల పరిధి కంటె పెద్దదని, దేశమంతటికీ ప్రయోజనకరమనీ ఆయన వ్యాఖ్యానించారు.
రామ్‌నాథ్ కోవింద్ మీడియాతో మాట్లాడుతూ ‘‘కేంద్రం ఏకాభిప్రాయం సాధించాలి. ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీకో ఉపయోగపడేది కాదు, దేశం మొత్తానికీ ఉపయోగపడుతుంది. జమిలి ఎన్నికలు అనేది పెద్ద గేమ్‌ఛేంజర్. అది నా అభిప్రాయం కాదు, ఆర్థికవేత్తలది. ఆ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొస్తే దేశం జిడిపి 1 నుంచి 1.5శాతం అదనంగా పెరుగుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు’’ అని వివరించారు.
‘ఒక దేశం – ఒక ఎన్నిక’ ప్రతిపాదనను కేంద్ర క్యాబినెట్ ఈ యేడాది సెప్టెంబర్‌లో ఆమోదించింది. లోక్‌సభతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభలకు, అర్బన్ బాడీలకు, పంచాయతీలకు కూడా ఒకేసారి, అంటే వంద రోజుల వ్యవధిలో ఎన్నికలు జరపాలని ఈ ప్రతిపాదన సారాంశం.
దానికోసం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక ఉన్నతస్థాయి ప్యానెల్ ఏర్పాటయింది. ఆ ప్యానెల్ తమ నివేదికలో పలు సిఫార్సులు చేసింది.
ఇప్పుడు ఈ బిల్లుకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసిన సందర్భంలో ప్రధానమంత్రి సైతం మాట్లాడుతూ ఆ నిర్ణయాన్ని ప్రశంసించారు. ‘‘జమిలి ఎన్నికలపై ఉన్నత స్థాయి కమిటీ చేసిన సిఫార్సులను క్యాబినెట్ ఆమోదించింది. ఈ ప్రయత్నానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను, ఈ బృందంలో కలిసి పనిచేసిన అందరినీ అభినందిస్తున్నాను. మన ప్రజాస్వామ్యాన్ని మరింత సమున్నతంగా, మరింత ఎక్కువమంది పాల్గొనేలా చేయడంలో ఇది ఒక ప్రధానమైన ముందడుగు’’ అని మోదీ ఎక్స్‌లో ట్వీట్ చేసారు.