ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. నారాయణపూర్ జిల్లా బస్తర్ పరిధిలోని అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, భద్రతా దళాలకు జరిగిన ఎదురు కాల్పుల్లో 12 మంది నక్సల్స్ ప్రాణాలు కోల్పోయారు. దంతెవాడ, నారాయణపూర్, కొండవాడ, జగదల్‌పూర్ ప్రాంతాల నుంచి బస్తర్ ప్రాంతంలో నక్సల్స్ ఏరివేత చేపట్టిన బలగాలు అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో జల్లెడపడుతున్నాయి.
ఈ క్రమంలో ఇవాళ ఉదయం బలగాలను గమనించిన మావోయిస్టులు కాల్పులకు దిగినట్లు తెలుస్తోంది. భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరపడంతో 12 మంది మావోయిస్టులు చనిపోయారు. యాంటీ నక్సల్స్ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది.
ఛత్తీస్‌గఢ్‌లో 2026 నాటికి నక్సల్స్ రహిత రాష్ట్రంగా చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పిలుపు నిచ్చారు. ఇందులో భాగంగా మావోయిస్టుల ఏరివేత వేగంగా జరుగుతోంది. గత నెలలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒకేసారి 38 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. త్వరలో బస్తర్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా టూర్ ఉండటంతో బలగాలు గాలింపు ముమ్మరం చేశాయని తెలుస్తోంది.