మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పంపారు. వైసీపీ అధికారం కోల్పోవడానికి పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయాలే కారణమంటూ అవంతి ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడవక ముందే ధర్నాలు చేయాలంటూ వైసీపీ అధినేత పిలుపు నివ్వడాన్ని అవంతి తప్పుపట్టారు. కొత్త ప్రభుత్వానికి కనీసం సంవత్సరం అయినా సమయం ఇవ్వాలని కోరారు. అలా కాకుండా ఆరు నెలలకే ధర్నాలు, నిరసనలు అంటే కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడతారని గుర్తుచేశారు.
వైసీపీ అధినేత అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా ప్రజలు కూటమికి అధికారం కట్టబెట్టారని అవంతి శ్రీనివాస్ గుర్తుచేసుకున్నారు. అంటే వైసీపీ అధినేతపై వ్యతిరేకత కారణంగానే పార్టీ ఓటమిపాలైందన్నారు. ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని, గడచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో తనకు క్షణం తీరికలేకుండా పోయిందని, కొన్నాళ్లు తన సమయాన్ని కుటుంబానికి కేటాయిస్తానని చెప్పారు.
తాను జనసేనలో చేరుతున్నానంటూ వస్తోన్న వార్తలను అవంతి శ్రీనివాస్ ఖండించారు. ప్రస్తుతానికి తాను ఏ పార్టీలో చేరడం లేదన్నారు. తనకు డబ్బుతో పనిలేదని, పదవులు ఆశించడం లేదన్నారు. తనకు గౌరవం ఎక్కడ దక్కితే ఆ పార్టీలో ఉంటానంటూ అవంతి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.
అవంతి రాజీనామా విశాఖ వైసీపీలో పెద్ద కుదుపుగానే చెప్పవచ్చు.అవంతితోపాటు మరికొందరు వైసీపీ నేతలు కూడా రాజీనామాకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. వాలంటీర్ల వ్యవస్థ వల్ల ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా విలువ లేకుండా పోయిందని అవంతి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేస్తూ వైసీపీకి రాజీనామా చేశారు.