బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో సోమవారం పర్యటించిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ బుధవారం నాడు విదేశాంగ వ్యవహారాలపై పార్లమెంటరీ స్థాయీ సంఘానికి ‘భారత్-బంగ్లాదేశ్ సంబంధాల భవిష్యత్తు’ గురించి వివరించారు. ఆ దేశంలో మైనారిటీల మీద జరుగుతున్న హింసాకాండకు బాధ్యులైన వారిమీద చర్యలు తీసుకుంటామని బంగ్లాదేశ్ హామీ ఇచ్చిందని ఆయన చెప్పారు.
మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం భారతదేశంతో పలు ఒప్పందాలను సమీక్షిస్తుందంటూ కొన్ని వార్తలు వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని విక్రమ్ మిశ్రీ చెప్పినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌లోని దాదాపు అన్ని పార్టీల నాయకులూ విక్రమ్ మిశ్రీని తమ మాజీ ప్రధాని, ప్రస్తుతం భారత్‌లో తలదాచుకుంటున్న షేక్ హసీనా గురించి అడిగారట.
ఢాకాలో మీడియాతో మాట్లాడినప్పుడు మిశ్రీ బంగ్లాదేశ్ నాయకులతో తమ బృందం అన్ని విషయాల గురించీ స్పష్టంగా, నిర్మొహమాటంగా, నిర్మాణాత్మకంగా చర్చలు జరిపామని చెప్పారు. ఇరుదేశాలకూ అత్యంత ప్రధానమైన ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన విషయాల గురించి సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని చెప్పారు. మిశ్రీ బంగ్లాదేశీ నాయకులు, అధికారులతో ఆ దేశంలో హిందువులు సహా మైనారిటీల మీద దాడుల విషయం గురించి చర్చించారు. ‘‘ఇటీవలి పరిణామాల గురించి మేం చర్చించాం. బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రత, సంక్షేమానికి సంబంధించి మా ఆందోళనలను వారికి తెలియజేసాం. సాంస్కృతిక, ధార్మిక ఆస్తులపై జరిగిన దాడుల గురించి చర్చించాం. భారత్ బంగ్లాదేశ్‌తో సానుకూలమైన, నిర్మాణాత్మకమైన పరస్పర లాభదాయకమైన సంబంధాన్ని కోరుకుంటోందని వివరించాను’’ అరని మిశ్రీ మీడియాకు చెప్పారు.
విక్రమ్ మిశ్రీ తన బంగ్లాదేశ్ పర్యటనలో తాత్కాలిక ప్రభుత్వపు ప్రధాన సలహాదారు మొహమ్మద్ యూనస్, విదేశీ వ్యవహారాల సలహాదారు మహమ్మద్ తౌహీద్ హుసేన్‌తో సమావేశమయ్యారు. బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శి జషీముద్దీన్‌తో విదేశాంగ స్థాయి సంప్రదింపులు జరిపారు.