నటుడు మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. మంచు మనోజ్, మోహన్‌బాబుల మధ్య జరిగిన వివాదంలో జల్‌పల్లి నివాసం వద్దకు మంగళవారంనాడు విలేకరులు పెద్దఎత్తున చేరుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో మీడియా ప్రతినిధులు మోహన్‌బాబును ప్రశ్నిస్తున్న సమయంలో, ఆయన ఓ విలేకరి చేతిలో మైకు లాక్కుని మొహంపై బలంగా కొట్టారని కేసు నమోదైంది. ఆ సమయంలో ఓ టీవీ ఛానల్ కెమెరామెన్‌ను బౌన్సర్లు తోయడంతో కిందపడి గాయపడినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పహాడీ షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
మోహన్‌బాబుపై బీఎన్‌ఎస్ 118(1), 109 సెక్షన్ల కింద కేసు నమోదైంది. గాయపడ్డ విలేకరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మోహన్‌బాబు హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మంచు మనోజ్, మంచు విష్ణులను పిలిపించి హైదరాబాద్ నగర సీపీ విచారణ జరిపారు. వారి లైసెన్సుడు తుపాకులను స్వాధీనం చేసుకున్న పోలీసులు, బౌన్సర్లపై కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికి మంచు కుటుంబంలో వివాదానికి తెర పడిందని తెలుస్తోంది.