బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందింది. అది క్రమంగా బలపడి తీరందాటే సమయానికి వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో తమిళనాడు, ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది. రాబోయే 48 గంటల్లో ఈ తీవ్ర అల్పపీడనం, వాయుగుండంగా మారి తమిళనాడు, శ్రీలంక మధ్య తీరం దాటే అవకాశముందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది.
తీవ్ర అల్పపీడనం ప్రభావంతో గురువారం, శుక్రవారం, శనివారంనాడు రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీని ప్రభావంతో గడచిన 24 గంటల్లో ఏపీలో 10 నుంచి 30 మి.మీ వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండి తెలిపింది.
ఏపీలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. చలిగాలులు, మంచు పెరిగింది. కనిష్ఠ ఉష్ణోగ్రత 9 డిగ్రీలకు పడిపోయింది. గరిష్ఠ ఉష్ణోగ్రత 31 డిగ్రీలు నమోదైంది. రాబోయే 48 గంటల్లో తేమ గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. తీరం వెంట 30 నుంచి 55 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశముంది.
తెలంగాణలో వాతావరణం పొడిగా ఉంది. చలి తీవ్రత పెరిగింది. ఉదయం 9 గంటల వరకు మంచు కురుస్తోంది. కనిష్ఠ ఉష్ణోగ్రత 10, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలుగా నమోదైంది.