శంబల (సంభాల్)లో ఇటీవల జరిగిన హింసాకాండకు సంబంధించి పోలీసులు సోమవారం సోదాలు నిర్వహించారు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జియావుర్ రెహమాన్ బరక్కు సంబంధించిన ప్రదేశాల్లో సోదాలు జరిగాయి. ఆ క్రమంలో అక్రమ ఆయుధాలు, మాదకద్రవ్యాలను పోలీసులు జప్తు చేసారు. 34 మోటార్సైకిళ్ళకు చలాన్ విధించారు, 4 బైక్‌లను సీజ్ చేసారు.
నవంబర్ 24న వివాదాస్పద జామా మసీదులో సర్వే చేయాలన్న కోర్టు ఉత్తర్వుల మేరకు ఆ ప్రాంతానికి వెళ్ళిన పోలీసులపై స్థానికులు దాడులు చేసారు. ఆ కేసుకు సంబంధించి, సోమవారం మధ్యాహ్నం 3గంటల తర్వాత పోలీసులు తిమర్దాస్ సరాయ్ ప్రాంతంలోని పలు నివాసాల్లో సోదాలు చేపట్టారు.
ఆ క్రమంలో ముల్లా ఆసిఫ్ ఇంటిని తనిఖీ చేసినప్పుడు 93 ప్యాకెట్ల శ్మాక్ అనే మత్తుమందు దొరికింది. తజ్వర్, మహబర్ అనే వ్యక్తుల ఇళ్ళలోనుంచి 315 బోర్ పిస్టళ్ళు లభించాయి. 1999లో ఒక హత్యకేసులో జైలుశిక్ష అనుభవించిన మహబర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నవంబర్ 24 నాటి హింసాత్మక ఆందోళన కార్యక్రమంలో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన ముస్లిం కార్యకర్తల మృతదేహాల్లో సైతం 315 బోర్ పిస్టల్ బులెట్లు దొరికాయని పోలీసులు ప్రకటించారు. ప్రస్తుతం పోలీసులు మహబర్, ముల్లా ఆసిఫ్, తజ్వార్ల ఇళ్ళలో దొరికినవారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్ళారు.
ఈ మొత్తం వ్యవహారం మీద జ్యుడీషియల్ ఇంక్వైరీ జరుగుతోంది. ఘర్షణలకు పాల్పడిన వారి మీద కఠినమైన చర్యలు తీసుకుని తీరతామని అధికారులు చెప్పారు. ఎస్పి ఎంపి జియావుర్ రెహమాన్ ఇంటిముందు పోలీసులు రెండుసార్లు కవాతు చేసారు. సంభాల్ జిల్లా అంతటా వాహనాల తనిఖీలు చేపట్టారు.
నవంబర్ 24న సంభల్‌లో జరిగిన హింసాకాండలో సమాజ్‌వాదీ ఎంపీ జియావుర్ రెహమాన్ బరక్ ప్రమేయం ఉందని పోలీసులు ఆరోపిస్తున్నారు. హింస జరగడానికి రెండు రోజుల ముందు ఎంపీ ఎలాంటి ముందస్తు అనుమతీ లేకుండా ఆ మసీదుకు వెళ్ళాడు, తన భావోద్వేగకర ప్రసంగాలతో జనాలను రెచ్చగొట్టాడు, అశాంతికి ఘర్షణలకూ కారణమయ్యాడు అని పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేసారు. అయితే, హింస జరిగిన రోజు తాను సంభల్‌లో కాదు, ఉత్తరప్రదేశ్‌లోనే లేనని ఎంపీ బరక్ వాదిస్తున్నాడు. యూపీ పోలీసులు తనపై కుట్ర చేస్తున్నారన్నది అతని ఆరోపణ.