నెల్లూరు జిల్లాలో సోమవారం నమోదైన ఓ విషాదకర దుర్ఘటన రాష్ట్ర ప్రజలకు దిగ్భ్రాంతి కలిగించింది. మెదడులో కణితితో బాధపడుతున్న భవ్యశ్రీ అనే ఎనిమిదేళ్ళ చిన్నారి బాలిక చర్చిలో ‘అద్భుత చికిత్స’ ప్రార్థనల పేరిట 40 రోజులు ఉంచేయడంతో ప్రాణాలు కోల్పోయింది. బ్రెయిన్ ట్యూమర్ తగ్గిపోతుందనే భ్రమలో బాలిక కుటుంబం చర్చిలోనే ఉండిపోయి ప్రార్థనలు, ఉపవాసాలూ చేసినా ఫలితం లేకపోయింది. క్రైస్తవ మిషనరీలు వైద్యచికిత్స పేరుతో నిర్వహిస్తున్న ‘మిరాకిల్ హీలింగ్’ కార్యక్రమాల డొల్లతనానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ.
స్థానిక కథనాల ప్రకారం భవ్యశ్రీ నెల్లూరు జిల్లా కలువాయి మండలం బాలాజీరావుపేటలోని దళిత కాలనీకి చెందిన లక్ష్మయ్య, లక్ష్మి దంపతుల బిడ్డ. కొంతకాలంగా ఆమె తలపోటు, వాంతులతో బాధపడుతోంది. తల్లిదండ్రులు ఆమెను నెల్లూరు, తిరుపతిలోని ఆస్పత్రులకు తీసుకువెళ్ళినా ఫలితం లేకపోయింది. డాక్టర్లు ఆమె మెదడులో ఒక కణితి ఉందని, దానికి శస్త్రచికిత్స చేయాలనీ చెప్పారు. సర్జరీకి కావలసినంత ఆర్ధిక స్తోమత లేకపోవడంతో వారు బంధువులను, ఆస్పత్రి వర్గాలనూ సాయం కోరారు.
ఆ సమయంలో కొందరు బంధువులు బాధిత బాలికను ఆదూరుపల్లిలోని చర్చికి తీసుకువెళ్ళమని సలహా ఇచ్చారు. అక్కడ అద్భుతాలు జరుగుతాయని, మిరాకిల్ హీలింగ్తో బాలికకు నయం అవుతుందనీ సూచించారు. ఆ చర్చిలో ప్రార్థనలు చేస్తే బాలిక అనారోగ్యం నుంచి బైటపడుతుందని చెప్పారు. దాంతో భవ్యశ్రీని తీసుకుని తల్లిదండ్రులు ఆ చర్చికి వెళ్ళారు. వారు అక్కడ 40 రోజులు ఉన్నారు. ప్రార్థనలు, ఉపవాసాలూ చేసారు. దాంతో బాలిక ఆరోగ్యం బాగుపడుతుందని వారు నమ్మారు.
బాలిక ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ విషమిస్తూనే ఉంది. అయినా చర్చిలో ప్రార్థనలతో అద్భుతం జరుగుతుందని, తమ కుమార్తె ఆరోగ్యం బాగుపడుతుందనీ ఆ కుటుంబం విశ్వసించింది. చర్చి బాధ్యులు సైతం బాలిక పరిస్థితి దిగజారడాన్ని గమనించినా ఆస్పత్రికి తరలించమని సూచించలేదు. పైగా దేవుని జోక్యం వల్లనే చిన్నారి ఆరోగ్యం కుదుటపడుతుందని నమ్మబలికారు.
దురదృష్టవశాత్తు భవ్యశ్రీ డిసెంబర్ 9 అర్ధరాత్రి తుదిశ్వాస విడిచింది. తన ఆరోగ్యం కోసం తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్న చర్చి ఆవరణలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆ విషాదకర సంఘటన, అలాలంటి మతపరమైన సంస్థల బాధ్యత విషయంలో ఆందోళన కలిగిస్తోంది. బాలికకు సరైన వైద్యం అందకపోవడం వల్లనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆ కేసులో ఇప్పటివరకూ ఎలాంటి ఫిర్యాదూ నమోదు కాలేదు.