మణిపూర్ ప్రభుత్వం రాష్ట్రంలో చట్టవిరుద్ధంగా సాగుచేస్తున్న 45 ఎకరాల పాపీ తోటలను ధ్వంసం చేసింది. ఆ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరేంద్రసింగ్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించారు.
మణిపూర్ రాష్ట్ర అటవీ శాఖ, సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్, జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో ఉఖ్రుల్ జిల్లాలోని ఫుంగ్యార్ దగ్గర మాపిథేల్ పర్వతశ్రేణిలో సాగుచేస్తున్న గసగసాల తోటలను ధ్వంసం చేసారు. ఆ కేసుకు సంబంధించి ఉఖ్రుల్ జిల్లా పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసారు.
భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్ ఏడాదికి పైబడి కాలం నుంచి హింసాకాండ, జాతుల ఘర్షణలను ఎదుర్కొంటోంది. సామాన్య ప్రజలు, భద్రతా బలగాలపై మిలిటెంటు గ్రూపులు దాడులు చేస్తున్నాయి. ఆ అతివాద వర్గాలు మాదకద్రవ్యాల విక్రయం నుంచే నిధులు సమకూర్చుకుంటున్నాయి. దాంతో రాష్ట్రంలో మాదకద్రవ్యాల వ్యాపారాన్ని సమూలంగా తుడిచిపెట్టేయాలని మణిపూర్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
గతేడాది మణిపూర్లో 20వేలకు పైగా హెక్టార్లలో అక్రమ పాపీ తోటలను ధ్వంసం చేసామని, 3వేల మందికి పైగా వ్యక్తులను అరెస్ట్ చేసామనీ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ ఈ యేడాది ఏప్రిల్లో ప్రకటించారు. డ్రగ్స్ తయారీదారులు, స్మగ్లర్లు, సప్లయర్లపై 2461 కేసులు పెట్టామని వెల్లడించారు.