స్మృతి మంధాన శతకం వృథా…
సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్
పెర్త్ వేదికగా తలపడిన ఆసీస్, భారత్
ఆసీస్ పర్యటనలో భాగంగా ఆదేశ మహిళల క్రికెట్ జట్టుతో మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ఆడిన భారత మహిళల జట్టు, చివరిదైన మూడో మ్యాచ్ లోనూ ఓడింది. దీంతో సిరీస్ ను ఆసీస్ 3-0 తో కైవసం చేసుకుంది.
పెర్త్ వేదికగా జరిగిన మూడో మ్యాచ్ లో భారత ఓపెనర్ స్మృతి మంధాన సెంచరీ చేశారు. 109 బంతులు ఆడి 105 పరుగులు చేసిన స్మృతి ఏకంగా 14 ఫోర్లు , ఒక సిక్స్ బాదారు. వన్డేల్లో ఆమెకు ఇది తొమ్మిదో సెంచరీ. ఆశ్లేగ్ గార్డినర్ వేసిన 35.3 బంతిని ఆడటం లో తడబడి ఔట్ అయ్యారు. స్కోర్ బోర్డు 189 పరుగుల వద్ద ఉన్నప్పుడు నాలుగో వికెట్ రూపంలో స్మృతి వెనుదిరిగింది.
మరో ఓపెనర్ రిచా ఘోష్ (2)నిరాశపరిచినా స్మృతి అద్భుతమైన షాట్లతో స్కోర్ బోర్డు వేగం పెంచారు. అయితే జట్టులో మిగతా వారు ఆసీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొలేకపోయారు. హర్లీన్ డియోల్ (39) ఒక్కరే ఫరవాలేదనపించగా, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (12), జెమీమా రోడ్రిగ్స్ (16) నిరాశపరిచారు.
దీప్తి శర్మ, సైమా థాకూర్ డకౌట్ గా వెనుదిరగడంతో మ్యాచ్ పై భారత్ ఆశలు వదులుకోవాల్సి వచ్చింది. మిన్ను మణి (8)ఆసీస్ బౌలర్ల ధాటికి క్రీజులో ఎక్కువ సేపు నిలవలేదు. అరుంధతీ రెడ్డి(5) తొమ్మిదో వికెట్ గా వెనుదిరగగా, రేణుకాసింగ్ క్రీజులోకి అడుగుపెట్టింది. అయితే 45.1 బంతికి టైటాస్ సాధు పదో వికెట్ గా ఔట్ కావడంతో భారత్ ఓటమి ఖాయమైంది. పది వికెట్ల నష్టానికి భారత్ 215 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఆసీస్ 83 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 298 పరుగులు చేసింది.ఓపెనర్ల ఫోయిబ్ లిచ్ ఫీల్డ్(25), జార్జియా వోల్(26) ను అరుంధతీ రెడ్డి పెవిలియన్ కు చేర్చింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఎలీసా ఫెర్రీ(4), బెత్ మూనీ(10) స్వల్ప స్కోర్ కే అరుంధతీ బౌలింగ్ లో ఔట్ కావడంతో మ్యాచ్ పై పట్టుబిగించేందుకు భారత్ కు అవకాశం లభించినట్లు అయింది. కానీ ఐదో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన అన్నాబెల్, అద్భుతమైన ఆటతో ఆసీస్ భారీ స్కోర్ చేసేందుకు దోహదపడ్డారు.
అన్నాబెల్ 95 బంతుల్లో 110 పరుగులు చేసి రనౌట్ కాగా, అస్లే గార్డెనర్ 64 బంతుల్లో అర్థశతకం కొట్టి దీప్తిశర్మ బౌలింగ్ లో పెవిలియన్ చేరింది. తహ్లియా మెక్ గ్రాత్ 50 బంతుల్లో 56 పరుగులతో నాటౌట్ గా నిలిచింది.