భారత పురావస్తు సర్వేక్షణ శాఖ (ఎఎస్ఐ) ఇటీవల రెండు తమిళ శాసనాలను విశ్లేషించింది. ఆ శాసనాలు చోళుల కాలానికి చెందినవిగా తేల్చింది. తమిళనాడు తిరుచ్చి జిల్లా తురయ్యూర్ దగ్గర అలత్తుదయన్‌పట్టిలోని అరుళ్‌మిగు సోమనాథర్ ఆలయంలో ఆ శాసనాలు లభించాయి.
ఎఎస్ఐలో అసిస్టెంట్ ఎపిగ్రాఫిస్ట్‌గా పనిచేస్తున్న బి చారుమతి సెప్టెంబర్ నెలలో ఆ శాసనాలను మ్యాప్‌లితో కాగితం మీదకు కాపీ చేసారు. ఆ శాసనాలు తమిళ భాషలో రాయబడి ఉన్నాయని, వాటిని నిపుణులు అధ్యయనం చేసారనీ ఆమె తెలియజేసారు. ఆ శాసనాలు 13వ శతాబ్దం నాటివి.
ఆ శాసనాల్లో ఒకటి, చోళరాజుల్లో ఒకడైన మూడవ రాజరాజు వేయించినది. తిరుజ్ఞానసమ్మన్ధ పండిదర్ (తిరుజ్ఞాన సంబంధ పండితర్) అనే పండితుడిని ఒక నిర్దిష్ట కాలం పాటు ఆలయ సేవల్లో నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వు అది.
మరో శాసనంలో వల్లువప్పడి నట్టార్‌లు జారీ చేసిన ఉత్తర్వు ఉంది. పెరియనవలూరులోని అళగియ సోమేశ్వర ముడియ నాయనార్ కోవెలలో గుమస్తాగా పనిచేసిన దేవర్‌కణ్మికి ఆ ఆదేశం పంపించారు. ఏడాదికి 30వేల కాసుల శిస్తుకు తమ పొలాలను కౌలుకు ఇచ్చి, ఆ సొమ్మును ఆ కోవెలలోని దేవతా మూర్తులకు సేవలు చేసేందుకు అందించాలని ఆ శాసనంలోని ఆదేశం చెబుతోంది.
తమిళనాడులోని వివిధ జిల్లాల్లోని ఆలయాల్లో ఉన్న శాసనాలను కాపీ చేసేందుకు ఎపిగ్రాఫిస్టులు, నిపుణులతో కూడిన మూడు బృందాలు త్వరలో పని మొదలుపెడతాయని మైసూరులోని ఎఎస్ఐ (ఎపిగ్రాఫీ) విభాగం డైరెక్టర్ కె మునిరత్నం రెడ్డి వెల్లడించారు. ఇటువంటి శాసనాలు ఏవైనా ప్రజల దృష్టికి వస్తే తమకు తెలియజేయాలని ఆయన విజ్ఞప్తి చేసారు.