కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదైన ధనుర్మాసం ప్రారంభం కాబోతుంది. డిసెంబరు 16న ఉదయం 6.57 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్నాయి. దీంతో డిసెంబరు 17న స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. వచ్చే ఏడాది జనవరి 14న ధనుర్మాస ఘడియలు ముగియనున్నట్లు పండితులు తెలిపారు.
ధనుర్మాసంలో తిరుమల శ్రీవారికి విశేష కైంకర్యాలు నిర్వహిస్తారు. బిల్వ పత్రాలతో సహస్ర నామార్చన చేయడంతో శ్రీవిల్లి పుత్తూరు చిలుకలను ప్రతి రోజూ అలంకరిస్తారు. స్వామికి దోశ, బెల్లం దోశ, సుండలు, సీరా, పొంగల్ ప్రసాదాలను నివేదిస్తారు.
పురాణాల్లో పేర్కొన్న మేరకు ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందు శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. 12 మంది ఆళ్వార్లలో ఒకరైన శ్రీ ఆండాళ్(గోదాదేవి) రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆళ్వార్ దివ్యప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం. ధనుర్మాసం మొత్తం తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు. భోగశ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు.