ఉత్తరప్రదేశ్లోని బారాబంకి జిల్లా సత్రిక్ స్టేషన్ పోలీసులు మూడురోజుల క్రితం ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసారు. ఉమర్, అతని గ్యాంగ్ సభ్యులు ఆవులను స్మగ్లింగ్ చేసి వధిస్తున్న నేరానికి అరెస్ట్ అయ్యారు. అయితే ఆవుల స్మగ్లింగ్ కోసం వారు అనుసరించిన విధానం తెలుసుకుంటే మతి పోతుంది.
నిందితులు కాషాయ దుస్తులు ధరించి, నుదుట తిలకం బొట్లు పెట్టుకుని తిరుగుతూ ఆవుల స్మగ్లింగ్ వ్యాపారం చేసారు. గోరక్షకులమని చెప్పుకుంటూ ఆ ప్రాంతంలో ప్రజలను నమ్మబలికారు. ఉమర్ గ్యాంగ్ గతంలో తాము ఎదుర్కొన్న చట్టపరమైన సమస్యలు మళ్ళీ తలెత్తకుండా ఉండేందుకు, పోలీసులు తమను అనుమానించకుండా ఉండేందుకు ఇలా నకిలీ వేషాలతో అందరినీ మోసం చేసారు.
ఆవులను చంపుతున్నారని సమాచారం రావడంతో పోలీసులు సత్రిక్ దగ్గర ఒక అటవీ ప్రాంతంలో సోదాలు నిర్వహించారు. అక్కడ ఉమర్ ముఠా సభ్యులు ఆవును చంపేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అక్కడకు చేరుకున్న అధికారులు అక్కడున్న ఒక గుంపు జనాలతో తలపడాల్సి వచ్చింది. స్మగ్లర్లు పోలీసుల మీద కాల్పులు జరిపారు. దాంతో పోలీసులు ప్రతికాల్పులకు పాల్పడ్డారు. ఆ క్రమంలో సర్వర్, గుఫ్రాన్ అనే ఇద్దరు అనుమానితుల కాళ్ళకు తుపాకీ బులెట్ల గాయాలయ్యాయి. వాళ్ళతో పాటు మరో ఐదుగురినీ అరెస్ట్ చేసారు. వారి పేర్లు అంకుల్, ఉమర్, నవజీవన్, ఇర్ఫాన్, అజీజ్. వాళ్ళందరూ బారాబంకి, సీతాపూర్ జిల్లాలకు చెందిన వారు.
సంఘటనా స్థలంలో పోలీసులకు పలు వస్తువులు దొరికాయి. వాటిలో రెండు పిస్తోళ్ళు, మందుగుండు, గోవధ కోసం పెద్ద కత్తి, ఒక కారు, ఒక మోటర్ సైకిల్, ఒక జీవించి ఉన్న ఆవు.
ఉమర్ గ్యాంగ్ గురించి పోలీసుల దర్యాప్తులో తెలిసిన సమాచారం ఇలా ఉంది… ఆ గ్యాంగ్ సభ్యులు సమీపంలోని గ్రామాల్లోని ఆవులను లక్ష్యంగా చేసుకుంటారు. ఉమర్ కాషాయ దుస్తులు ధరించి, చేతిలో త్రిశూలం పట్టుకుంటాడు. ముఖానికి నిండుగా బొట్టు పెట్టుకుంటాడు. చూడగానే అతను గొప్ప గోరక్షకుడు అన్న భావన కలుగుతుంది. ఆ వ్యూహం ఫలించి, ఆ గ్రూపు చెక్పాయింట్స్ మీదుగా వెళ్ళినా స్థానికులు, అధికారులు వారిని తనిఖీ చేయలేదు.
ఉమర్ గ్యాంగ్ చరిత్ర కూడా నేరమయమైనదే. అతని మీద ఇప్పటివరకూ 14 కేసులు నమోదయ్యాయి. అవన్నీ ఆవుల స్మగ్లింగ్, గోవధకు సంబంధించినవే. ఉమర్ గతంలో కొన్నిసార్లు అరెస్ట్ అయ్యాడు కూడా. వాటిని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ఈ గోరక్షకుడి వేషం కట్టాడని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పుడు కేసులు పెట్టడంతో పాటు పాత కేసులు కూడా రీఓపెన్ చేస్తున్నారు.