మహిళల క్రికెట్ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ ముందు భారీ లక్ష్యం ఉంది. పెర్త్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 ఓవర్లు నష్టపోయి 298 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అరుంధతీ రెడ్డి నాలుగు వికెట్లు తీయగా దీప్తి శర్మ ఓ వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఆసీస్ ఓపెనర్ల ఫోయిబ్ లిచ్ ఫీల్డ్(25), జార్జియా వోల్(26) ను అరుంధతీ రెడ్డి పెవిలియన్ కు చేర్చింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఎలీసా ఫెర్రీ(4), బెత్ మూనీ(10) స్వల్ప స్కోర్ కే అరుంధతీ బౌలింగ్ లో ఔట్ కావడంతో మ్యాచ్ పై పట్టుబిగించేందుకు భారత్ కు అవకాశం లభించినట్లు అయింది. కానీ ఐదో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన అన్నాబెల్, అద్భుతమైన ఆటతో ఆసీస్ భారీ స్కోర్ చేసేందుకు దోహదపడ్డారు.
అన్నాబెల్ 95 బంతుల్లో 110 పరుగులు చేసి రనౌట్ కాగా, అస్లే గార్డెనర్ 64 బంతుల్లో అర్థశతకం కొట్టి దీప్తిశర్మ బౌలింగ్ లో పెవిలియన్ చేరింది. తహ్లియా మెక్ గ్రాత్ 50 బంతుల్లో 56 పరుగులతో నాటౌట్ గా నిలిచింది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇప్పటికే రెండింటిలో ఓడింది. ఈ మ్యాచ్ లో 299 పరుగులు సాధిస్తే విజయం వరిస్తుంది.