భారతదేశపు ప్రాదేశిక సమగ్రతపై వివాదాలను రేకెత్తిస్తూ అంతర్జాతీయంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్న ‘ఫోరమ్ ఆఫ్ డెమొక్రటిక్ లీడర్స్ ఇన్ ఆసియా పసిఫిక్ ఫౌండేషన్ : ఎఫ్‌డిఎల్ ఎపి ఫౌండేషన్’తో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి ఉన్న సంబంధాలపై భారతీయ జనతా పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఎఫ్‌డిఎల్ ఎపి సంస్థకు జార్జ్ సొరోస్ ఫౌండేషన్‌తో సంబంధాలు ఉండడం, కశ్మీర్ వేర్పాటువాదానికి ఆ సంస్థ మద్దతు ఇస్తుండడం కారణంగా, ఆ సంస్థ లక్ష్యాలూ దాని సంబంధాలూ భారత్‌కు సమస్యాత్మకంగా ఉన్నాయని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ ఆందోళన వ్యక్తం చేసారు.
ఎఫ్‌డిఎల్ ఎపి సంస్థ బహిరంగంగానే కశ్మీర్‌కు స్వతంత్రం కావాలంటూ రెచ్చగొడుతూ ఉంటుంది. నేరస్తులుగా నిరూపణ అయిన వేర్పాటువాద నేతలను మహానుభావులుగా సమాజంలో ప్రచారం చేస్తూ ఉంటుంది. అలాంటి సంస్థతో సోనియా గాంధీకి సన్నిహిత సంబంధాలు ఉండడం తీవ్రమైన విషయం. ఈ సంబంధాల వల్ల భారతదేశపు సార్వభౌమత్వం, సమగ్రతల విషయంలో కాంగ్రెస్ వైఖరి మీద అనుమానాలు తలెత్తాయి.
ఎఫ్‌డిఎల్ ఎపి వివాదాస్పద లక్ష్యాలు:
ఎఫ్‌డిఎల్ ఎపి సంస్థ తమ లక్ష్యాలను బహిరంగంగానే ప్రకటించింది. జమ్మూకశ్మీర్ విషయమై భారతదేశపు అధికారిక వైఖరికి పూర్తి విరుద్ధమైన వైఖరిని ఆ సంస్థ పాటిస్తోంది, ప్రచారం చేస్తోంది. చిరకాలంగా ఉన్న భారత-పాకిస్తాన్ ఘర్షణలకు పరిష్కారం కశ్మీర్‌కు స్వతంత్రం ఇవ్వడమే అని ఆ సంస్థ బహిరంగంగానే వాదిస్తోంది.
ఎఫ్‌డిఎల్ ఎపి తన ‘మిషన్ స్టేట్‌మెంట్’లో తమ ప్రధాన దృష్టికేంద్రం కశ్మీర్ ఘర్షణ అని స్పష్టం చేసింది. దక్షిణాసియాలో శాంతి నెలకొనాలంటే కశ్మీర్‌ను భారత్ నుంచి వేరు చేసేయాల్సిందే అని పేర్కొంది. కశ్మీర్‌పై భారతదేశపు సార్వభౌమత్వాన్ని బలవంతంగా రుద్దుతుండడమే దక్షిణాసియా ప్రాంతంలో శాంతికి విఘాతం కలిగిస్తోందంటూ వ్యాఖ్యానించింది. పాకిస్తాన్, తదితర భారత వ్యతిరేక శక్తుల వాదనతో ఈ సంస్థ లక్ష్యాలు చక్కగా కలిసిపోతున్నాయి.
షబ్బీర్ షాకు మద్దతు:
కశ్మీరీ వేర్పాటువాద నాయకుడు షబ్బీర్‌షాను ఎఫ్‌డిఎల్ ఎపి సంస్థ మహానుభావుడిగా కీర్తిస్తుంది. షబ్బీర్‌షా ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. లష్కరే తయ్యబా వంటి పాకిస్తానీ సంస్థల నుంచి ఉగ్రవాద కార్యకలాపాల కోసం నిధులు అందుకున్నాడన్న ఆరోపణలు నిరూపణ అవడంతో అతన్ని ఖైదు చేసారు. అలాంటి వ్యక్తిని శాంతి కాముకుడుగా ఎఫ్‌డిఎల్ ఎపి సంస్థ చిత్రీకరించింది. షబ్బీర్ షా స్థాపించిన జమ్మూకశ్మీర్ డెమోక్రటిక్ ఫ్రీడమ్ పార్టీ ‘ప్రజలందరినీ కూడగట్టి అహింసా మార్గంలో పోరాటం’ చేస్తున్న సంస్థ అని వర్ణించింది. ఆ పార్టీ కశ్మీరీ ముస్లిములు, లద్దాఖీ బౌద్ధులు, జమ్మూ హిందువులకు ప్రాతినిధ్యం వహిస్తోందని గొప్పలు చెప్పింది. నిజానికి షబ్బీర్ షా ఉగ్రవాద చరిత్ర పోలీసుల, భారత జవాన్ల రికార్డుల్లో నమోదై ఉంది. షబ్బీర్ షాకి పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలతో ఉన్న బలమైన ఆర్థిక సంబంధాలు నమోదై ఉన్నాయి. సోనియాగాంధీ సహనేతృత్వం వహిస్తున్న సంస్థ అలాంటి వివాదాస్పద వ్యక్తిని పని గట్టుకుని ఎందుకు ప్రోత్సహిస్తోందని బీజేపీ నిలదీసింది.
ఎఫ్‌డిఎల్ ఎపి సంస్థకు జార్జ్ సొరోస్ ఫౌండేషన్‌తో ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. జార్జ్ సొరోస్ ఫౌండేషన్, మానవ హక్కుల ముసుగులో విభజనవాదాన్ని ప్రచారం చేసే గ్రూపులకు ఆర్థిక సహాయం చేస్తుందన్న ఆరోపణలున్నాయి. కోటీశ్వరుడైన వితరణశీలిగా పేరున్న జార్జ్ సొరోస్ భారతదేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం పతనం అవడాన్ని చూడాలన్నదే తన కోరిక అని పలుమార్లు బహిరంగంగానే వెల్లడించాడు.
దేశ విభజనవాదులతో సోనియా సంబంధాలపై బిజెపి ప్రశ్నలు:
బిజెపి ఐటి సెల్ హెడ్ అమిత్ మాలవీయ, ఎఫ్‌డిఎల్ ఎపి సంస్థతోనూ సొరోస్ ఫౌండేషన్‌తోనూ సోనియా గాంధీకి ఉన్న సంబంధాల గురించి నిలదీసారు. ‘‘భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని జార్జ్ సొరోస్ బహిరంగంగానే పిలుపునిచ్చాడు. అతని నిధులతో నడిచే సంస్థతో ఎఫ్‌డిఎల్ ఎపి సహ అధ్యక్షురాలు సోనియాగాంధీకి సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాల వల్ల, భారతదేశపు సార్వభౌమత్వం, ప్రజాస్వామ్యాల విషయంలో సోనియా గాంధీ నిబద్ధత మీద అనుమానాలు తలెత్తుతున్నాయి’’ అని అమిత్ మాలవీయ ప్రశ్నించారు.
ఎఫ్‌డిఎల్ ఎపి సంస్థలో సోనియాగాంధీ పాత్ర మీద బీజేపీ ప్రశ్నల పరంపర గుప్పించింది. వాటికి వెంటనే జవాబులు చెప్పాలని డిమాండ్ చేసింది.
— కశ్మీర్ వేర్పాటువాద భావజాలాన్ని ప్రోత్సహిస్తున్న ఎఫ్‌డిఎల్ ఎపి సంస్థకు సహ అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీ విశ్వసనీయత సందేహాస్పదంగా మారింది. భారత భూభాగాన్ని విచ్ఛిన్నం చేయాలని బహిరంగంగానే వాదించే సంస్థతో సోనియా గాంధీ ఎందుకు చేతులు కలిపారు?
— జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగం అన్నదే మొదటినుంచీ భారతదేశం వాదన. ఎఫ్‌డిఎల్ ఎపి ఆ వాదనతో నేరుగానే విభేదిస్తోంది. దక్షిణాసియాలో ప్రాదేశిక శాంతి కోసం కశ్మీర్‌కు స్వతంత్రం ఇచ్చేయాలని వాదిస్తోంది. ఆ వాదనను సోనియా గాంధీ అంగీకరిస్తున్నారా?
— షబ్బీర్ షాను అహింసకు ప్రతిరూపంగా ఎఫ్‌డిఎల్ ఎపి ప్రచారం చేస్తోంది. అలా తప్పుదోవ పట్టించే ప్రచారం, సరిహద్దులకు ఆవలి నుంచి వస్తున్న ఉగ్రవాదంపై పోరాటానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలను తక్కువ చేసి చూపించడమే. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు అందిస్తున్నాడని నేరం నిరూపణ అయిన షబ్బీర్ షా లాంటి వేర్పాటువాద నేతలను ఎఫ్‌డిఎల్ ఎపి ఎందుకు గొప్పవారిగా చూపిస్తోంది?
సోనియాగాంధీకి జార్జి సొరోస్‌తోనూ, ఎఫ్‌డిఎల్ ఎపితోనూ ఉన్న సంబంధాలు భారతదేశపు ప్రాదేశిక సమగ్రత, జాతీయ భద్రతలకు ప్రత్యక్షంగా ప్రమాదకరమని బీజేపీ హెచ్చరించింది. వేర్పాటువాద ఉద్యమాలకు చేయూతనిస్తూ, అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న ఎఫ్‌డిఎల్ ఎపి సంస్థతో భారతదేశపు రాజకీయ పార్టీ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అంటకాగడంపై ఆందోళన వ్యక్తం చేసింది.