దంపతులు మధ్య కలహాలు, పుట్టింటికి వెళ్ళిన భార్య
భార్య కేసు పెట్టడంతో మనస్తాపం…
బెంగళూరులో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. భార్య వేధిస్తోందంటూ ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి బలవన్మరణం చెందాడు. అయితే సదరు వ్యక్తి రాసిన 40 పేజీల సూసైడ్ నోట్ చదివితే మాత్రం అయ్యో ఇన్ని బాధలు పడ్డావా అనిపించకమానదు. ఎంత వేదన అనుభవించాడు అని జాలి చూపాల్సిందే.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
ఉత్తరప్రదేశ్‌కు చెందిన 35 ఏళ్ళ అతుల్ సుభాష్, మారతహళ్లి మంజునాథ లేఔట్లో నివాసం ఉంటున్నారు. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులకు లభించిన ఆధారాల ప్రకారం తెలుస్తోంది. సుభాష్ కు భార్య, నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు. అయితే దంపతుల మధ్య కలహాల కారణంగా భార్య పుట్టింటికి(యూపీ) వెళ్ళింది. అక్కడి పోలీస్ స్టేషన్ లో భర్త పై కేసు పెట్టింది.
కేసులను ఎదుర్కోలేక ఆదివారం అర్ధరాత్రి 40 పేజీల డెత్‌నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంతకు ముందే పలు రకాల డాక్యుమెంట్లను ఓ సేవా సంస్థ వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేశాడు. తన కుటుంబానికి సాయం చేయాలని కోరాడు. ఇంటి తాళం ఎక్కడ ఉంది, ఇతర వివరాలు అందులోనే పంచుకున్నాడు. తన నాలుగేళ్ల కుమార్తె కోసం ఒక కానుకను కొనుగోలు చేసినట్లు తెలపడంతో దానిని ఆమెకు అందజేయాలని కోరాడు. డెత్‌నోట్‌ను సుప్రీంకోర్టుకు అందజేయాలని విన్నవించాడు.
మూడురోజుల నుంచి అతడు ఆత్మహత్యకు యత్నిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి ఆత్మహత్య చేసుకునే వరకు ఏమేం పనులు చేయాలో ఓ బోర్డుపై రాసుకున్నాడు. తనకు న్యాయం జరగడమే మిగిలి ఉందని రాసి ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు.
సమాచారం అందిన వెంటనే మారతహళ్లి పోలీసులు, సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే సుభాష్ ప్రాణాలు విడిచారు. డెత్ నోట్ స్వాధీనం చేసుకుని భార్య,ఇతర కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు.