విభజన చట్టం హామీల అమలుకు ప్రాధాన్యం
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలుకు కేంద్రప్రభుత్వం విరివిగా సాయం అందిస్తోంది. విభజన చట్టంలో పేర్కొన్న వాగ్దానం మేరకు మంగళగిరిలో ఎయిమ్స్ ఏర్పాటు చేయడంతో ఆ సంస్దకు మరిన్ని అదనపు సౌకర్యాలు కల్పిస్తోంది. ఎయిమ్స్ లో అవసరమైన సిబ్బందిని కూడా ఎప్పటికప్పుడు భర్తీ చేస్తోంది. 960 పడకల సామర్థ్యంతో మంగళగిరి ఎయిమ్స్‌లో గత ఐదేళ్లలో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులు 483 పెరిగాయని, ఖాళీల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోందని కేంద్రం తెలిపింది.
కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావ్ జాదవ్, రాజ్యసభలో ఈ విషయాన్ని వెల్లడించారు. కేంద్రం తీసుకుంటున్న చర్యల కారణంగా దిల్లీ ఎయిమ్స్ (3,669 బెడ్స్) తర్వాత అత్యధిక పడకలున్న 9 ఎయిమ్స్‌ల జాబితాలో మంగళగిరి చేరింది. 2020-21లో ఇక్కడ బోధన సిబ్బంది పోస్టులు 183, బోధనేతర సిబ్బంది పోస్టులు 1,062గా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది జనవరి – అక్టోబర్ మధ్యకాలంలో 69,371 మంది టీబీ జబ్బు కారణంగా మరణించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్రంలో 1,208 మంది మరణించారన్నారు.
దేశవ్యాప్తంగా 50 టెక్స్టైల్ పార్కులు ఉండగా అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న పార్కుగా విశాఖపట్నంలోని బ్రాండిక్స్ గుర్తింపు పొందింది. రూ.134.42 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టు ద్వారా 19 వేల మందికి ఉపాధి లభిస్తుందని కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గరీటా లోక్ సభ సమావేశాల్లో తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.40 కోట్లు వెచ్చిచ్చినట్లు తెలిపారు. హిందూపుర్ వ్యాపార్ అపారెల్ పార్క్, తారకేశ్వర్ టెక్స్టైల్ పార్క్, గుంటూరు టెక్స్టైల్ పార్కులకు ఒక్కోదానికి కేంద్రం రూ.40 కోట్లు సాయం అందిస్తుందన్నారు. ఈ మూడు పార్కుల ద్వారా 1,400 మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు.
ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజనలో భాగంగా ‘పర్ డ్రాప్- మోర్ క్రాప్’ కింద 2024-25 ఆర్థిక ఏడాదికి ఆంధ్రప్రదేశ్‌లో 1.24 లక్షల హెక్టార్లను చేర్చాలని గుర్తించినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్‌నాథ్ ఠాకుర్ తెలిపారు. 2015-16 నుంచి 2023-24 వరకు ఏపీ నుంచి ఈ పథకంలో 9.30 లక్షల హెక్టార్లు చేరాయని తెలిపారు.