మానవ తాత్వికతకు పరాకాష్ఠగా పరిగణించే భగవద్గీత మతాల పరిమితులకు అతీతమైన, సర్వకాలాలకూ సరిపడే మార్గ దిక్సూచి. గీత భారతీయ నాగరికత హృదయం నుంచి ఆవిష్కృతమైనా, దాని సూత్రాలు సార్వజనీనం, సార్వకాలీనం. నైతిక విలువలతో జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవడం ఎలాగో ప్రపంచానికి నేర్పించే సూత్రం గీత.
తత్వం అంటే సంతోషాన్ని అన్వేషించడమే. నిజమైన సంతృప్తిని సాధించడం ఎలాగో అన్వేషించే శాస్త్రమే తత్వశాస్త్రం. అత్యున్నత స్థాయి ఆనందాన్ని, స్వీయ జాగృతినీ సాధించగలిగిన వారి అనుభవాలూ ఆలోచనల సమాహారమే తత్వశాస్త్రం. ఆ మహత్తర సత్యాలను తరువాతి తరాలకు నిధిగా అందించారు మన పూర్వీకులు. ఆ సంప్రదాయంలో అలా అందిన అద్భుత గ్రంధాల్లో ఉత్కృష్టమైనది భగవద్గీత. స్థల కాల మతాలతో సంబంధం లేకుండా మనుషులు అందరికీ వర్తించే తాత్విక గ్రంథాల వరుసలో ముందుపీటీన ఉండేది భగవద్గీత.
గీతను హిందువుల మతగ్రంథంగా భావించడమంటే దాని సార్వజనీనతను, సార్వకాలీనతనూ తప్పుగా అర్ధం చేసుకోవడమే. భౌతికశాస్త్రపు సూత్రాలను ఒకచోట కనిపెట్టి ఉండవచ్చు, కానీ అవన్నీ మొత్తం ప్రపంచానికి వర్తిస్తాయి కదా. అలాగే భగవద్గీత బోధించే సూత్రాలు సైతం ప్రపంచవ్యాప్తంగా మానవాళి అందరికీ ఉపయుక్తమే. మనం నిత్యజీవితంలో తరచూ ఎదుర్కొనే సవాళ్ళకు, భావోద్వేగాలకూ ప్రపంచంతో పని లేదు. కానీ అటువంటి సవాళ్ళకు, భావోద్వేగాలకు, ఆశయాలూ ఆకాంక్షలకు పరిష్కార మార్గం భగవద్గీత.
హిందూధర్మం భగవద్గీతను తమ మార్గదర్శక ఉపకరణంగా అంగీకరించింది. ఆ విజయం, గీత అందించే జ్ఞానం కారణంగానే హిందూధర్మం వేలయేళ్ళుగా నిలబడే ఉంది. అయితే అది కేవలం హిందువులకు మాత్రమే పరిమితం కాదు. క్రోధం, దురాశ, ద్వేషం, ప్రేమ, సంతృప్తి, జ్ఞానాల గురించి భగవద్గీత చేసే బోధలు సమస్త మానవాళికీ వర్తిస్తాయి.
ఈ విశ్వంలో అత్యంత సంక్లిష్టమైన జీవి మానవుడే. శరీరాలు, జ్ఞానాలు, మనసులు, మేధావులు, ఎప్పుడైనా అహంకారంతో దెబ్బతినవచ్చు. ఆ దెబ్బలు మానసిక వేదనకు దారితీయవచ్చు. దాన్ని అధిగమించి, జీవితంలో సరైన దారిలో నడవడానికి మనకు మార్గదర్శనం కావాలి. అటువంటి మార్గదర్శనాన్ని మనకు అత్యంత స్పష్టతతో అందించే మహాద్భుత గ్రంథమే భగవద్గీత.
భగవద్గీత మనను కొన్ని నిర్దిష్టమైన ఆచారాలను పాటించమని చెప్పదు. అన్ని కాలాలకూ వర్తించే సార్వజనీన సత్యాలను బోధిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే మానవులకు ఉండే కోపం, ఆశ, బంధాలు వంటి నైజాలను ఎదుర్కోడం ఎలాగో నేర్పిస్తుంది. ప్రతీ నాగరికతా ఎదుర్కొనే సవాళ్ళు అవే. వాటికి భగవద్గీత వేలయేళ్ళ క్రితం అందించిన పరిష్కారాలు ఈనాటికీ వర్తిస్తాయి. మనలోని ప్రతికూల భావాలను ప్రేమ, సంతృప్తి, శాంతి, జ్ఞానంగా ఎలా మలచుకోవాలి, నైతికజీవనాన్ని ఎలా గడపాలి అని బోధించే అద్భుతమైన తత్వశాస్త్రమే భగవద్గీత.
భగవద్గీత అన్నది కేవలం ఆధ్యాత్మికమైన, తాత్వికమైన గ్రంథం మాత్రమే కాదు. అది నాగరికతకు సాక్షీభూతంగా నిలిచిన ప్రమాణం. మానవుడి మనుగడ, నాగరికతల ఉత్థాన పతనాల గురించి శాశ్వత సత్యాలను వెల్లడించింది. గీత అసందర్భంగా ఉన్న కాలం లేదు, అది ఆచరణాత్మకంగా మారే కాలమూ ఉండబోదు.
భగవద్గీత బోధనలు మానవులు తమలోని అంతర్గత దైవత్వాన్ని, నిబిడీకృతమైన శక్తినీ అర్ధం చేసుకోడానికి సహాయపడతాయి. జీవితపు ప్రయోజనాన్ని తెలుసుకుని సామరస్యంగా జీవించే మార్గాన్ని చూపిస్తాయి. భగవద్గీత మానవ అనుభవాలు, దృక్కోణాలలోని వైవిధ్యాన్ని వివరిస్తుంది, అదే సమయంలో వాటన్నింటి ఉనికిలోనూ ఇమిడి ఉన్న ఐక్యతనూ స్పష్టం చేస్తుంది. దాన్ని అవగాహన చేసుకుని అర్ధం చేసుకోగలిగితే విభిన్న శకలాలుగా విభజితమైపోయిన ఈ ప్రపంచంలో శాంతినీ, జ్ఞానాన్నీ కోరుకునేవారికి దీపకళికగా నిలుస్తుంది.
భగవద్గీత మెరుగైన జీవితానికి మార్గదర్శి మాత్రమే కాదు, మన ఉనికిలోని సంక్లిష్టతలను స్పష్టంగా, ధైర్యంగా, సహానుభూతితో అర్ధం చేసుకుని ముందుకు నడవడానికి దారిచూపే దిక్సూచి. భగవద్గీత అందించే జ్ఞానాన్ని గౌరవిద్దాం. మననూ, మానవాళినీ మెరుగుపరచుకోడానికి గీత సూచించే సూత్రాలకు అనుగుణంగా జీవిద్దాం.