ఏలూరు పట్టణంలో డయోసీస్ ఆఫ్ ఏలూరు నిర్వహిస్తున్న సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ హాస్టల్లో ఘోరం జరిగింది. చిన్నారి శిశువు అనుమానాస్పదంగా చనిపోయిన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఆ హాస్టల్లో ఉంటూ ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుకుంటున్న నంద్యాలకు చెందిన విద్యార్ధినికి ఆ శిశువు పుట్టినట్లు తెలుస్తోంది. ఆ విద్యార్ధిని నన్ అవడానికి శిక్షణ తీసుకుంటోంది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఆ బాలికకు అక్కడ శిక్షణ ఇస్తున్న క్రిస్టియన్ ఫాదర్‌తో ఏర్పడిన సంబంధమే ఈ విషాదానికి దారితీసిందని తెలుస్తోంది.
డిసెంబర్ 8 ఆదివారం ఉదయం హాస్టల్ దగ్గరున్న ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్న ఒక వ్యక్తి, నవజాత శిశువును విసిరేస్తున్న దృశ్యం చూసారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న టూటౌన్ సీఐ రమణ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో కలిసి కాన్వెంట్కు చేరుకున్నారు. అక్కడ హాస్టల్ వెనకాల ఖాళీ ప్రదేశంలో నిర్జీవంగా పడిఉన్న శిశువు మృతదేహాన్ని కనుగొన్నారు. శిశువు బొడ్డుతాడు కూడా అక్కడే ఉంది. ఎత్తునుంచి పడేయడంతో అక్కడ రక్తపు మరకలు కూడా ఉన్నాయి.
శిశువును ప్రసవించిన బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. శిశువు శవాన్ని అటాప్సీకి పంపించారు. సాక్ష్యాలు సేకరించానికి ఫోరెన్సిక్ బృందాలు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
ఈ కేసు దర్యాప్తు చేస్తున్న డిఎస్పి శ్రావణ్ కుమార్, హాస్టల్ నిర్వాహకులను విచారించారు. బాలిక స్నేహితురాళ్ళను, ఆమె రూంమేట్స్ను కూడా ఇంటరాగేట్ చేసారు.
పోలీసులు సేకరించిన ప్రాథమిక సమాచారం ప్రకారం… నంద్యాలకు చెందిన బాలిక సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్లో నన్ శిక్షణ పొందుతోంది. ఆమెకు అక్కడ శిక్షణ ఇస్తున్న క్రైస్తవ ఫాదర్‌తో సంబంధం ఏర్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఒక అనుమానితుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
నవజాత శిశువు మరణంతో హాస్టల్ నిర్వాహకులపై తీవ్ర విమర్శలు తలెత్తాయి. చర్చ్ అనుబంధ హాస్టల్ పర్యవేక్షణలో లోపాలు ఉన్నట్లు బైటపడింది. అసలు ఆ బాలిక గర్భం ఎవరికీ తెలియకుండా ఎలా ఉందన్న దానిపై అనుమానాలు తలెత్తాయి. తొమ్మిది నెలల గర్భాన్ని మోసే బాలిక శరీరంలో మార్పులను ఎవరూ గమనించలేదా అన్న ప్రశ్నలు కలుగుతున్నాయి. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే, ఆమెకు తోటి విద్యార్ధినులే ప్రసవం చేసారని, వారే ఆ శిశువును పడేసారనీ తెలుస్తోంది. కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిఎస్పి ధ్రువీకరించారు.
సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ అనేది దేశవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ మిషనరీ సంస్థల్లో ఒకటి, డయోసీస్ ఆఫ్ ఏలూరు కింద పనిచేస్తుంది. అది క్రైస్తవ మత విద్యను అందించే కేంద్రం. ముఖ్యంగా యువతులను క్రైస్తవ నన్స్‌గా మార్చడానికి వారికి తగిన శిక్షణ ఇచ్చే కేంద్రం.
చర్చ్‌లు, క్రైస్తవ సంస్థల్లో లైంగిక అత్యాచారాలు, అక్రమ సంబంధాలు భారతదేశంలో చాలాసార్లు వెలుగు చూసాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి సంఘటనలు చాలా అరుదు. కేరళలో చర్చ్ ఫాదర్లకు నన్స్‌తో అక్రమ సంబంధాలు, అత్యాచార సంఘటనలు ఎక్కువే. నన్స్ను లైంగికదోపిడీ చేసిన ఘటనలు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో చాలా వెలుగు చూసాయి.
మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో చర్చిలు నిర్వహించే అనాథ శరణాలయాల్లో లైంగిక వేధింపుల కేసులు చాలా నమోదయ్యాయి. ఝార్ఖండ్‌లో మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థలో చిన్నారులను అమ్మేసుకునే కుంభకోణం సంచలనం సృష్టించింది. ఇవన్నీ చర్చిల నిర్వహణలో లోపాలను, జవాబుదారీతనం లేమిని, వాటిని ప్రశ్నించడంలో వ్యవస్థ వైఫల్యాలనూ కళ్ళకు కడుతున్నాయి.
చర్చిలు కేంద్రాలుగా ఇలాంటి నేరాలు పదేపదే జరుగుతున్నా వాటిని వెలుగులోకి రానీయకుండా ఆ చర్చ్లే అడ్డుకున్న సంఘటనలు కోకొల్లలు. వెలుగు చూసి, కేసు వరకూ వెళ్ళిన సంఘటనలు చాలా తక్కువ. జీవితాలు నాశనమైపోతాయని హెచ్చరించడం ద్వారానో, డబ్బులు ప్రలోభపెట్టడం ద్వారానో, ఆర్థికంగా స్థిరత్వం కల్పించడం ద్వారానో, సమాజం నుంచి వెలి వేస్తామని బెదిరించడం ద్వారానో బాధితులను నోరు మూయించేసే కేసులే ఎక్కువ. ఆ నేపథ్యంలో, ఏలూరు ఘటన వెలుగు చూడడం, దానిలో చర్చి ఫాదర్ ప్రమేయం బైటపడుతుండడం విశేషం.