ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. మంత్రి పేషీలో నెంబరుకు ఫోన్ చేసిన ఆగంతకుడు పవన్ కళ్యాణ్‌ను చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. వెంటనే సిబ్బంది పవన్ కళ్యాణ్ దృష్టికి, పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
సచివాలయంలోని పవన్ పేషికి కాల్ చేసిన వ్యక్తిని గుర్తించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం ప్రాంతం నుంచి బెదిరింపు కాల్ వచ్చినట్లు తేలింది. పోలీసులు అనుమానితుడికోసం వేట ప్రారంభించగా అతను ఫోన్ స్విచాఫ్ చేశాడు. దీంతో పోలీసులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు.
తిరువూరుకు చెందిన నూకా మల్లిఖార్జునరావు మద్యం సేవించి బెదిరింపు కాల్ చేసినట్లు గుర్తించారు. ఇతనికి మతిస్థిమితం లేదని కూడా తెలుస్తోంది. నూకాను రహస్య ప్రాంతంలో పోలీసులు విచారిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు భద్రత పెంచే విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.