అన్నదమ్ముల మధ్య ఆర్థిక వివాదాలు …!
మనోజ్‌పై కేసు పెట్టిన మోహన్ బాబు
తనను కొట్టారంటూ కేసు పెట్టిన మనోజ్
ఎంబీయూ వర్సిటీలో ఇతరుల పెత్తనం ఎందుకంటున్న మనోజ్
ఫీజుల పెంపును వ్యతిరేకించిన విద్యార్థి సంఘాలకు మద్దతు
నటుడు, విద్యావేత్త, మాజీ పొలిటీషియన్ మంచు మోహన్ బాబు కుటుంబంలో కలహాలు రచ్చకెక్కాయి. మనోజ్‌తో విభేదాలున్నాయని మీడియా అంటుంటే అదేం లేదు అందరి ఇళ్ళలో ఉండే సమస్యలే అంటూ మోహన్ బాబు ముక్తాయిస్తారు. కానీ తరచూ గొడవలతో మంచు ఇంటి వ్యవహారాలు మీడియాలో బ్రేకింగ్ న్యూస్‌గా మారుతున్నాయి.
తాజాగా మంచు తండ్రీ కొడుకులు పరస్పర ఫిర్యాదులతో పోలీసులను ఆశ్రయించడంతో మొత్తం సోషల్ మీడియాకు మంచి మేత దొరికింది. మోహన్‌బాబు కుమారులైన విష్ణువర్ధన్ బాబు, మనోజ్ మధ్య కొన్నాళ్ళుగా కలహాలు ఉన్నాయి. సోదరుల మధ్య పూడ్చలేనంత అగాధం ఏర్పడిందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. మంచు మనోజ్ రెండో వివాహం విషయంలోనూ విష్ణు ఏమీ పట్టనట్లే వ్యవహరించారు. చుట్టంలా పెళ్ళికి వెళ్ళి అక్షింతలు వేసారు.
నటులుగా తండ్రి స్థాయిలో సగమైనా ఆదరణ సంపాదించలేని అన్నదమ్ములు, గొడవలతో చర్చనీయాంశంగా మారారు. ఢీ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న విష్ణు ఆ తర్వాత ఆ స్థాయిలో ప్రేక్షకుల మెప్పుపొందలేకపోయారు. ఓ సినిమాలో ఒక కులాన్ని అవమానించేలా సంభాషణలు, పాత్రలు పెట్టి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ సమస్యను పరిష్కరించుకోవడంలో తీవ్రంగా విఫలమై ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వేదం సినిమాలో నటించిన మంచు మనోజ్ నటుడిగా మంచి మార్కులు తెచ్చుకున్నారు. కానీ ఆ తర్వాత మనోజ్ కు వరుస ఎదురుదెబ్బలు తగిలాయి.
మోహన్ బాబు కుమారులు ఇద్దరూ కులాంతర వివాహాలు చేసుకున్నారు. మంచు విష్ణు, వైఎస్ కుటుంబానికి చెందిన అమ్మాయిని వివాహమాడగా… మనోజ్ భూమా కుటుంబానికి చెందిన మౌనికను పెళ్లాడారు. ఐనా ఆయన మీద ఓ కులానికి చెందిన వాడు అనే ముద్ర ఉంది. సోషల్ మీడియాలో మంచు ఇంటి కలహాలు ఎక్కువగా చర్చ జరగడానికి ఇది కూడా ఓ కారణమనే విశ్లేషణలు ఉన్నాయి. గతంలో విష్ణు, మనోజ్ మధ్య వివాదంలో వారి సోదరి లక్ష్మీప్రసన్న మధ్యవర్తిగా వ్యవహరించి శాంతింప చేసింది.
తాజా గొడవ మాత్రం సోదరుల మధ్య కాకుండా తండ్రీ కుమారుల మధ్య జరిగినట్లుగా పోలీసులకు అందిన ఫిర్యాదుల ద్వారా తెలుస్తోంది. మోహన్‌బాబు, మనోజ్ మధ్య గొడవ జరిగింది. కానీ ఆ వార్తలను మంచు కుటుంబం తేలికగా తీసిపడేస్తోంది. అందరి ఇళ్ళలోలాగానే తమ ఇంట్లోనూ విభేదాలు ఉన్నాయంటున్నారు. ఈ సారి గొడవ లో మోహన్ బాబుకు చెందిన ‘మోహన్ బాబు యూనివర్సిటీ (MBU)’ కీలకంగా మారింది.
విష్ణు, ఆయన అనుచరుడు వినయ్ మహేశ్వరి.. మోహన్‌బాబు యూనివర్సిటీ(ఎంబీయూ) విద్యార్థులను ఫీజుల పేరిట దోపిడీ చేస్తున్నారని మనోజ్ ఆరోపిస్తున్నారు. వర్సిటీలో ఆర్థిక అవకతవకలకు సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. వర్సిటీలో అక్రమాలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేసే పోరాటానికి తన మద్దతు ఉంటుందని తెలిపారు. మోహన్ బాబు వర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజా వివాదంపై స్పందించిన మనోజ్ తనకు ఆస్తులు, వారసత్వం కాక, న్యాయం కావాలని చెబుతున్నారు. అయితే మోహన్ బాబు, విష్ణు మాత్రం ఇది కుటుంబ సమస్య అని, దానిని తామే సామరస్యంగా పరిష్కరించుకుంటామని చెబుతున్నారు.