రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టాయి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే,సమాజ్‌వాదీ, జనతాదళ్, ఆప్ ఎంపీలు 50 మంది సంతకాలు చేసి, రాజ్యసభ సెక్రటేరియట్లో సమర్పించారు. సభలో చర్చలు ఏకపక్షంగా జరుగుతున్నాయంటూ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టినట్లు ప్రతిపక్ష ఎంపీలు చెబుతున్నారు. అవిశ్వాసం నెగ్గాలంటే రాజ్యసభలో సగానికిపైగా సభ్యులు మద్దతు పలకాల్సి ఉంది. లోక్‌సభలోనూ మెజారిటీ సభ్యులు ఆమోదం తెలపాలి. అయితే ప్రతిపక్షాలకు అంత బలం లేదు. కాబట్టి జగదీప్ ధన్‌ఖడ్ అవిశ్వాసం నెగ్గే అవకాశం లేదు.
వ్యాపారవేత్త జార్జ్ సోరెస్‌తో కాంగ్రెస్ నేత సోనియాగాంధీకి సంబంధాలున్నాయని, గత ఎన్నికల్లో అతని నుంచి పెద్ద ఎత్తున నిధులు పొందారని బీజేపీ ఎంపీలు ఆరోపణలు చేయడంతో రాజ్యసభలో గందరగోళం ఏర్పడింది. ఈ సమయంలోనే ప్రతిపక్ష సభ్యులు ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం తెరమీదకు తెచ్చారు.
సంభల్ అల్లర్లు, రైతుల మద్దతు ధరలపై సభలో చర్చకు అధికారపార్టీ సభ్యులు సిద్దంగా లేరని అందుకే వారు ఆందోళనకు దిగుతున్నారని కాంగ్రెస్ ఎంపీలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ నేత సోనియాగాంధీతో వ్యాపారవేత్త జార్జ్ సోరెస్కు ఉన్న సంబంధాలపై ఆ పార్టీ ఎంపీలు ఎందుకు నోరు విప్పడం లేదని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రశ్నించారు. దీంతో రాజ్యసభలో గందరగోళం ఏర్పడింది.