తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి వేడుకలు ఈ నెల 12న ఘనంగా నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
పౌరాణిక నేపథ్యం ప్రకారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన శేషగిరులమీద దక్షిణభాగంలో కొన్ని మైళ్ల దూరంలో మహా పవిత్రతీర్థమగు చక్రతీర్థం వెలసిఉంది.
ప్రతీ ఏడాది తమిళకార్తిక మాసం మేరకు శుద్ధద్వాదశినాడు ఈ చక్రతీర్థ ముక్కోటి తిరుమలలో నిర్వహించనున్నారు. ఆ రోజున స్వామివారికి ప్రాతఃకాల, మధ్యాహ్న ఆరాధనలు స్వామివారు ఆలయం నుంచి ఊరేగింపుగా చక్రతీర్థానికి వెళ్ళనున్నాయి.
చక్రతీర్థంలో వెలసిన శ్రీ చక్రత్తాళ్వారు స్వామి, నరసింహస్వామివారికి, ఆంజనేయస్వామివారికి అభిషేకం, పుష్పాలంకారం ఆరాధన చేస్తారు. హారతి నివేదన తర్వాత శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు.
స్కంద పురాణం ప్రకారం మహర్షి అనే యోగి చక్రతీర్థంలో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చి శంఖు, చక్ర, గధా భూషితుడైన శ్రీ వేంకటేశ్వరస్వామి అతనికి ప్రత్యక్షమై కల్పాంతం వరకు తనకు పూజలు చేయాల్సిందిగా చెప్పి అంతర్థానమైనట్లు పేర్కొన్నారు.
పద్మనాభ మహర్షి చక్రతీర్థంలో తపస్సు ప్రారంభించగా ఒకనాడు ఓ రాక్షసుడు అతనిని భక్షించేందుకు వచ్చాడు.అప్పుడు స్వామి తన చక్రాయుధాన్ని పంపించి ఆ రాక్షసుని సంహరించాడు. ఆ తరువాత మహర్షి స్వామివారి శ్రీ సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండి భక్తులకు రక్షణ కల్పించాల్సిందిగా కోరాడు. దీంతో ఆ ప్రాంతం చక్రతీర్థంగా ప్రసిద్ధిగాంచింది.
వరాహ పూరాణ నేపథ్యంలో తిరుమలలోని శేషగిరులలో వెలసిన 66కోట్ల తీర్థాలలో అత్యంత ముఖ్యమైనవిగా చెప్పబడే సప్త తీర్థాలలో చక్రతీర్థము కూడా ఒకటిగా పురాణాల్లో పేర్కొన్నారు.