‘ఒక దేశం పరిపాలన అక్కడి మెజారిటీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలి. మెజారిటీ ప్రజలకు సంక్షేమం కలిగించేది, వారిని సంతోషపెట్టే పద్ధతులే ఆమోదించబడాలి’ అని అలహాబాద్ హైకోర్టు జడ్జి శేఖర్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు.
‘ఉమ్మడి పౌరస్మృతి రాజ్యాంగ ఆవశ్యకత’ అనే అంశంపై విశ్వహిందూ పరిషత్ లీగల్ సెల్ ప్రయాగరాజ్‌లో ఆదివారం (డిసెంబర్ 8) నిర్వహించిన కార్యక్రమంలో న్యాయమూర్తి శేఖర్ యాదవ్ పాల్గొన్నారు. అక్కడ తన ప్రసంగంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.
‘‘ఉమ్మడి పౌరస్మృతి అనేదాన్ని ప్రతిపాదించినది విశ్వహిందూ పరిషత్తో, ఆర్ఎస్ఎస్సో లేక హిందూధర్మమో కాదు. ఈ దేశపు అత్యున్నత న్యాయస్థానం సైతం అదే విషయాన్ని స్పష్టం చేసింది. ఈ దేశం త్వరలోనే ఉమ్మడి చట్టాన్ని అమలు చేస్తుందని ప్రమాణం చేస్తున్నాను. ఆ పని అతిత్వరలోనే జరగనుంది’’ అని న్యాయమూర్తి చెప్పారు.
ఉమ్మడి పౌరస్మృతి అనేది భారత పౌరులందరికీ పెళ్ళి, విడాకులు, వారసత్వం, దత్తత వంటి అంశాల్లో దేశ ప్రజలందరికీ ఒకేలా వర్తించే న్యాయసూత్రాల సమాహారం. ప్రస్తుతం ఉత్తరాఖండ్, గోవా మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ వివిధ మతాల వ్యక్తిగత ఆచార వ్యవహారాలు, సంప్రదాయాల ఆధారంగా వారివారికి న్యాయసూత్రాలు ఉన్నాయి. సాధారణంగా అవి వారి మత గ్రంథాలు, మతధర్మాలకు లోబడి ఉంటాయి. అటువంటి ‘పర్సనల్ లా’స్ అనుసరించే పితృస్వామ్య భావజాలం వల్ల అణగారిపోతున్న మహిళలకు సమానత్వం, సమన్యాయం దక్కడానికి ఉమ్మడి పౌరస్మృతి (యుసిసి) అత్యావశ్యకం అన్నది బీజేపీ వైఖరి. అయితే ఓటుబ్యాంకు రాజకీయాల కారణంగా కాంగ్రెస్, ఇతర పార్టీలు యుసిసికి అడ్డంపడుతూ ఉన్నాయి.
శేఖర్ యాదవ్ తన ప్రసంగంలో హిందూ ధర్మానికీ, ముస్లిం మతానికీ ఉన్న తేడాలను ప్రస్తావించారు. అంటరాని తనం, సతీ సహగమనం వంటి దురాచారాలు ఒకప్పుడు హిందూ ధర్మానికి మచ్చగా ఉండేవని, వాటిని హిందూ సమాజం విడిచిపెట్టేసిందనీ, సనాతన ధర్మం వాటిని మొండిగా పట్టుకుని కూర్చోలేదనీ శేఖర్ చెప్పారు. అదే సమయంలో ముస్లిములు బహుభార్యాత్వాన్ని ఇంకా అనుసరిస్తున్నారన్న సంగతిని గుర్తు చేసారు.
వర్తమానంలో దురాచారాలుగా పరిగణిస్తున్న పలు సంప్రదాయాలను సనాతన ధర్మం వదిలిపెట్టేసిందని చెబుతూ శేఖర్, ‘‘ఒక మతంలో కాలంతో పాటు చొరబడే కొన్ని దోషాలు ఉంటాయి, వాటిని గుర్తించడం తప్పేమీ కాదు, కాలక్రమంలో అలాంటి వాటిని సవరించుకుంటూ ముందడుగు వేయాలి. ప్రతీ మతమూ తనలోని ప్రమాదకరమైన, దుష్టమైన దురాచారాలను తప్పనిసరిగా తొలగించుకోవాలి’’ అని చెప్పారు.
‘‘ఒక మహిళను ఎవరూ అగౌరవపరచకూడదు. హిందూ ధర్మశాస్త్రాలు, వేదాల్లో ఆమెను సాక్షాత్ దైవ స్వరూపంగా పూజిస్తాము. నలుగురు భార్యలను కట్టుకునే హక్కు, నిఖా హలాలా, ట్రిపుల్ తలాక్ వంటి దురాచారాలకు చట్టబద్ధత లేదు’’ అని వివరించారు. ముస్లిం మహిళల (వివాహ హక్కుల భద్రత) చట్టం 2019 తక్షణ ట్రిపుల్ తలాక్ పద్ధతిని నేరంగా నిర్ధారించింది. దానికి మూడేళ్ళ వరకూ జైలుశిక్ష విధిస్తారు.
మహిళలకు భరణం ఇవ్వకపోవడం, ఇతర అన్యాయాలను చట్టం సహించదని న్యాయమూర్తి చెప్పారు. ‘‘మనం (హిందువులం) మన పిల్లలకు చిన్నప్పటినుంచీ దయ, సహనం నేర్పిస్తాము. జంతువులను, ప్రకృతినీ ప్రేమించడం నేర్పిస్తాము. దానికి బదులు, పిల్లల కళ్ళ ముందే జంతువులను నరికి చంపుతుంటే వారికి దయ, సహనం ఎలా అలవడతాయి?’’ అని శేఖర్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు.
ముస్లిం ఛాందసవాదులపై ఆయన నిప్పులు కురిపించారు. ‘‘ఈ కట్‌ముల్లాలు… అది సరైన పదం కాదు, కానీ అలా అనడానికి నేను వెనుకాడను. ఎందుకంటే వాళ్ళు దేశానికి ప్రమాదకరం. వాళ్ళు దేశానికి వ్యతిరేకం. వాళ్ళవల్ల దేశానికి నష్టం. వాళ్ళు మామూలు ప్రజలను రెచ్చగొడతారు. దేశం అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటారు. వాళ్ళ విషయంలో జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి’’ అని జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ స్పష్టం చేసారు.