వార్ షిప్ ఇంజిన్ ఉక్రెయిన్ లో తయారీ
రెండేళ్ళుగా యుద్ధంలో మునిగిపోయిన రష్యా,ఉక్రెయిన్లు ఓ సమష్టి లక్ష్యం కోసం పనిచేశాయి. భారత్‌కు యుద్ధ నౌకను అందించే విషయంలో కలిసి పనిచేశాయి. ఐఎన్ఎస్ తుశిల్ వార్ షిప్‌ను సోమవారం మాస్కోలో భారత రక్షణ మంత్రి చేతులమీదుగా నౌకాదళంలో చేర్చారు.
భారత్ కోసం రష్యా తయారు చేసిన యుద్ధనౌకకు ఉక్రెయిన్ ఇంజిన్ సమకూర్చడం విశేషం. ఇరు దేశాలతో భారత్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇరు దేశాలు యుద్ధంలో తలపడుతూనే భారత్ కోసం కలిసి పనిచేయడం విశేషం. ఉక్రెయిన్ నుంచి ఇంజిన్లను సేకరించి రష్యాకు తరలించి అక్కడ నౌకల్లో బిగించారు.
ఐఎన్ఎస్ తుశిల్ బరువు 3,900 టన్నులు కాగా పొడవు 125 మీటర్లు ఉంది. తుశిల్ అంటే రక్షక కవచం గా అర్థం వస్తుంది. ‘నిర్భయ, అభేద్య ఔర్ బల్శీల్’ అనేది దీని నినాదం.
ఫ్రిగెట్ శ్రేణికి చెందిన రెండు నౌకల కోసం భారత నౌకాదళం 2016లో రష్యాకు ఆర్డర్ ఇచ్చాయి. మరో రెండు నౌకలను గోవా షిప్‌యార్డ్‌లో నిర్మించేలా ఆర్డర్ ఇవ్వనుంది. ఐఎన్ఎస్ తుశిల్ శ్రేణిని రష్యాలో క్రివాక్-3 శ్రేణి యుద్ధనౌకగా పిలుస్తారు. ఇలాంటి ఆరు నౌకలను భారత్ ఇప్పటికే వినియోగిస్తుండగా ఇవి మొత్తం రష్యా డాక్యార్డ్ల్లో తయారైనవే.