బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది గురువారం తమిళనాడు, శ్రీలంక వద్ద తీరం దాటే అవకాశాలున్నాయి. దీని ప్రభావంతో బుధ, గురు, శుక్ర, శనివారాల్లో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరించింది. దీని ప్రభావంతో చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు అవతాయని తెలిపారు. కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలకు అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
బంగాళాఖాతంలో 15వ తేదీ మరో అల్పపీడనం ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఈ నెల 18 వరకు ఏపీ, తమిళనాడులో వర్షాలు కురుస్తాయని అధికారులు ప్రకటించారు. దీని ప్రభావంతో తీరం వెంట గంటకు 50 నుంచి 75 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా మారాయి. వీటికి తేమ గాలులు తోడయ్యాయి. ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతూ ఉండటంతో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉభయగోదావరి, బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.