ఇవాళ రాజ్యసభలో, కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైన ఓ చిత్రం జరిగింది. తమ నాయకుడికి జార్జి సొరోస్‌తో సంబంధాలున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పరోక్షంగా ఒప్పుకున్నారు.
రాజ్యసభలో ఓ చర్చ సందర్భంగా జేడీయూ ఎంపీ సంజయ్ కుమార్ ఝా మాట్లాడుతూ ఒసిసిఆర్‌పి (ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్) అనే ఓ అంతర్జాతీయ సంస్థ ఇటీవల విడుదల చేసిన కొన్ని నివేదికల గురించి ప్రస్తావించారు. ఆ క్రమంలో, భారతదేశంలో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేస్తానని కంకణం కట్టుకున్న స్వీడిష్ కోటీశ్వరుడు జార్జి సొరోస్‌కు కాంగ్రెస్ పార్టీతో సంబంధాల గురించి కూడా మాట్లాడారు.
సంజయ్ ఝా ప్రకటనపై రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేసారు. సభలో లేని ఓ కాంగ్రెస్ నాయకుడి పరువుకు భంగం కలిగేలా జెడియు ఎంపి మాట్లాడడం సరికాదంటూ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు ఫిర్యాదు చేసారు.
అయితే, జెడియు ఎంపి ఎవరి పేరూ ప్రస్తావించలేదని, ఏ కాంగ్రెస్ నాయకుడి గురించి ఖర్గే మాట్లాడుతున్నారనీ జగదీప్ ధన్‌ఖడ్ మల్లికార్జున ఖర్గేను ప్రశ్నించారు.
దాంతో ఖర్గే మాట తడబడింది. సభాపతి ప్రశ్నకు జవాబివ్వలేకపోయారు. దానికి బదులు సభ నియమ నిబంధనలు ఉటంకించడానికి ప్రయత్నించారు. చివరికి, ఝా వ్యాఖ్యలను తప్పుపడుతున్నది ఏ నాయకుడి గురించి అన్న విషయాన్ని చెప్పకుండా ఊరుకున్నారు. ఆ వ్యవహారం మొత్తం మీద ఒక కాంగ్రెస్ నాయకుడికి జార్జి సొరోస్‌తో సంబంధాలు ఉన్నాయని మల్లికార్జున ఖర్గే పరోక్షంగా ఒప్పుకున్నట్లయింది.
ఒసిసిఆర్‌పి, హిండెన్‌బర్గ్ వంటి సంస్థలు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసే తప్పుడు వార్తలనే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. అధికార కాంక్షతో, మోదీపై ద్వేషంతో దేశానికి కీడు చేయడానికి కూడా వెనుకాడని రాహుల్ గాంధీకి జార్జి సొరోస్‌తో సంబంధాలు ఉన్నాయన్న సంగతి కూడా బహిరంగ రహస్యమే.