విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్లోని శారదాధామంలో అఖిల భారత సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాలకు దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి ప్రచార విభాగం మరియు అభిలేఖాగార్ (డాక్యుమెంటేషన్) విభాగాల నుంచి ప్రతినిధులు విచ్చేశారు. గత ఏడాది కాలంలో నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. సంఘటన పరంగా పటిష్టం చేసేందుకు మార్గాలను చర్చించారు. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా పోషిస్తున్న పాత్ర మీద సమాలోచనలు జరిపారు.
ప్రారంభ కార్యక్రమానికి క్షేత్ర అధ్యక్షులు మరియు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ చామర్తి ఉమామహేశ్వరరావు, కార్యదర్శి అయాచితుల లక్ష్మణరావు అతిథులుగా విచ్చేశారు. ఎనిమిది అంచెలుగా సమీక్షలు చేపట్టారు. అఖిల భారతీయ మహామంత్రి లలిత్ గోస్వామి, అఖిల భారతీయ సంఘటన మంత్రి గోవింద్ మహాపాత్రో, అఖిల భారతీయ ప్రచార ప్రభారీ లింగం సుధాకర్ రెడ్డి పర్యవేక్షించారు. కుటుంబ ప్రబోధన, పర్యావరణం, సామాజిక సమరసత, నాగరిక కర్తవ్య బోధ, స్వబోధ అనే ఐదు రకముల పంచ పరివర్తన మీద ప్రత్యేకంగా చర్చించారు. విద్యాలయం కేంద్రంగా చేపట్టాల్సిన సామాజిక అంశాల మీద దృష్టి పెట్టారు.
విద్యాభారతి వివిధ రాష్ట్రములు, క్షేత్రములకు సంబంధించిన ప్రగతి నివేదికలను ఆయా ప్రాంతాల కన్వీనర్లు సమర్పించారు. ఆయా పత్రముల ఆధారంగా కార్యాచరణ రూపొందించారు. దేశవ్యాప్తంగా రాబోయే సంవత్సరం కోసం భవిష్యత్తు లక్ష్యాలు ఏర్పాటు చేసుకొన్నారు. ప్రత్యేక ప్రాజెక్టులు అయిన ప్రకల్పములకు నిర్దిష్ట వ్యవస్థ ఉండాలని నిర్దేశించుకొన్నారు. విద్యార్థులు, యువతలో భారతీయ దృష్టి కోణాన్ని పెంపొందించేందుకు చొరవ చూపాలని నిర్ణయించారు. ఇందుకోసం సాంప్రదాయిక విధానాలతో పాటు అధునాతన మార్గాలను ఉపయోగించుకోవాలని నిర్ణయించారు.
ముగింపు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు మణిపూర్ సెంట్రల్ యూనివర్సిటీ ఛాన్సలర్ ప్రొఫెసర్ తిరుపతి రావు, కార్యదర్శి ముక్కాల సీతారాములు విచ్చేశారు. కార్యక్రమ వ్యవస్థను తెలంగాణ రాష్ట్ర సంఘటన మంత్రి పతకమూరి శ్రీనివాస్ రావు సమన్వయం చేశారు.