భారతీయ జనతా పార్టీ యువమోర్చా తమిళనాడు శాఖ నాయకుడు ప్రవీణ్ కుమార్ నెత్తారు హత్య కేసులో నిందితుడైన మొహమ్మద్ ఆసిమ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ అరెస్ట్ చేసింది. డిసెంబర్ 5న కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఎ విస్తృతంగా సోదాలు జరిపింది. ఆ కేసుకు సంబంధించి ఇప్పటివరకూ 19మందిని అరెస్ట్ చేసారు.
ప్రవీణ్ కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బీజేవైఎం కార్యదర్శిగా పనిచేసేవాడు. నిషిద్ధ ముస్లిం అతివాద సంస్థ పిఎఫ్ఐ కార్యకర్తలు 2022 జులై 26న ప్రవీణ్‌పై కత్తులతో దాడి చేసి దారుణంగా చంపేసారు. బళ్ళారి పోలీసులు ఆ కేసు దర్యాప్తును 2022 ఆగస్టు 4న ఎన్ఐఎకు అప్పగించారు.
ఈ కేసుకు సంబంధించి పారిపోయిన నిందితులు, అనుమానితులు, వారి సహచరులకు సంబంధించిన 16 ప్రదేశాల్లో ఎన్ఐఎ సోదాలు చేపట్టింది. కర్ణాటకలో బెంగళూరు, కొడగు, కేరళలోని ఎర్నాకుళం, తమిళనాడులో చెన్నయ్ సహా పలు ప్రదేశాల్లో గాలించింది. ఆ క్రమంలో పలు డిజిటల్ పరికరాలు, వందల కొద్దీ డాక్యుమెంట్లు సేకరించింది.
తిరువొత్తియూర్‌లోని రాధాకృష్ణన్ నగర్లో ఎన్ఐఎ అధికారులు మొహమ్మద్ ఆసిమ్‌కు సంబంధించిన ఇల్లు, కార్యాలయాల్లో గాలించారు. ఆసిమ్ ఈ హత్య కేసులో నిందితులకు ఆశ్రయం ఇచ్చాడు. ఆసిమ్‌ను అరెస్ట్ చేసిన ఎన్ఐఎ మరింత సమాచారం కోసం అతన్ని విచారిస్తోంది.
ఈ కేసులో ఎన్ఐఎ ఇప్పటివరకూ 19మందిని అరెస్ట్ చేసింది. వారితోపాటు, పరారీలో ఉన్న మరో నలుగురు నిందితులను కలుపుకుని, మొత్తం 23మంది మీద ఛార్జిషీట్లు దాఖలు చేసింది. నిందితులు, అనుమానితులు కలిపి ఏడుగురు పరారీలో ఉన్నారు. వారిమీద నాన్ బెయిలబుల్ వారంట్లు జారీ చేసింది. వారి ఆచూకీ తెలిపిన వారికి పారితోషికం కూడా ప్రకటించింది.