కర్ణాటకలో హిందువులకు పూజనీయుడైన శివకుమార స్వామి విగ్రహాన్ని ఒక క్రైస్తవుడు ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసాడు. పదిరోజుల క్రితం జరిగిన ఆ ఘటన బెంగళూరులో సంచలనం సృష్టించింది. ఆ విధ్వంసానికి పాల్పడిన క్రైస్తవ వ్యక్తిని పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేసారు. ఆ విగ్రహం ధ్వంసం చేయాలని తనకు ఏసుక్రీస్తు కలలో కనిపించి చెప్పాడని నిందితుడు పోలీసులకు చెప్పడం విశేషం.
శివకుమార స్వామీజీపై కర్ణాటక ప్రజలకు ఆరాధ్యభావం ఎక్కువ. రాష్ట్ర రాజధాని బెంగళూరులోని వీరభద్రనగర్ బస్టాండ్ వద్ద ఆయన విగ్రహం ఉంది. ‘జయ కర్ణాటక జనపర వేదికె’ అనే సంస్థ సభ్యులు ఐదేళ్ళ క్రితం ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. నవంబర్ 30 అర్ధరాత్రి దాటాక ఒంటిగంటన్నర సమయంలో శ్రీకృష్ణ (37) అనే వ్యక్తి ఆ విగ్రహాన్ని పదునైన వస్తువుతో ధ్వంసం చేసాడు. సదరు శ్రీకృష్ణ అనే హిందూపేరు కలిగిన క్రైస్తవుడు ఫుడ్ డెలివరీ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. ఆ రాత్రి శివకుమార స్వామి విగ్రహాన్ని పాడుచేసాక అతను పారిపోయాడు.
మరుసటిరోజు ఉదయం విగ్రహాన్ని గమనించిన స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గిరినగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. త్వరగా స్పందించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఫిర్యాదు నమోదు చేసుకున్నారు, ఆ వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఎట్టకేలకు ఈ ఘటనలో ప్రధాన నిందితుడు శ్రీకృష్ణను అరెస్ట్ చేసారు.
విచారణ సమయంలో శ్రీకృష్ణ అసాధారణమైన విషయాలు చెప్పుకొచ్చాడు. ఏసుక్రీస్తు తనకు కలలో కనిపించాడని, తనతో శివకుమార స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేయించాడనీ అతను చెప్పాడు.
శ్రీకృష్ణకు పెళ్ళి కాలేదు. అతను గత మూడేళ్ళుగా క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నాడు. హిందూ మతవిశ్వాసాలపై దాడులకు సంబంధించిన అన్ని కేసుల్లోలాగే ఈ కేసులో కూడా నిందితుడు మెంటల్ డిప్రెషన్ అనే మానసిక సమస్యతో బాధపడుతున్నాడని పోలీసులు చెప్పారు. అతనికి వైద్య పరీక్షలు చేయించారు. అతని ప్రవర్తనను పరిశీలించిన వైద్యులు అతని ఉద్దేశాల గురించి, అతని మానసిక ఆరోగ్యం గురించీ ఆందోళన చెందుతున్నారు. మతచిహ్నాలు, విగ్రహాలను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసే వారిపై చర్యలు తీసుకునే పద్ధతిలో, పోలీసులు నిందితుడిపై కేసు రిజిస్టర్ చేసారు.
అయితే శ్రీకృష్ణ వెల్లడించిన ప్రకటన కొత్త ఉద్రిక్తతలకు దారి తీసింది. బెంగళూరు ఆర్చిబిషప్, కేథలిక్ సమాజం అతని చర్యలను తీవ్రంగా ఖండించారు. ఏసు ఎవరి కలలోకైనా వచ్చి హిందూ విగ్రహాలను పడగొట్టమని చెప్పడని వారన్నారు. ఆ చర్య ద్వారా ఇరుమతాల మధ్యా ఉద్రిక్త పరిస్థితులు కలిగించడానికి, మతపరమైన శత్రుత్వాన్ని రెచ్చగొట్టడానికీ నిందితుడు ప్రయత్నించి ఉంటాడని వారు చెప్పారు. ఆ సంఘటనపై నిష్పాక్షికమైన దర్యాప్తు జరిపించాలని ఆర్చిబిషప్ డిమాండ్ చేసారు. మత సామరస్యానికి ఆటపట్టు అయిన బెంగళూరులో దాన్ని అడ్డుకునే ఎటువంటి చర్యనైనా దెబ్బతీయకూడదని ఆయన సూచించారు.
మరోవైపు, వీరశైవ మహాసభ సభ్యులు కూడా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. స్వామి విగ్రహం ఆ ప్రాంతపు సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైభవానికి నిదర్శనం అని గుర్తుచేసారు. ఆ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతామని గిరినగర్ పోలీస్ స్టేషన్ అధికారులు వెల్లడించారు.