ఈ శతాబ్దం టెక్, డేటాలదేనని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. రాజస్థాన్ ప్రభుత్వం నిర్వహించిన ది రైజింగ్ రాజస్థాన్ పెట్టుబడుల సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. పదేళ్లలో భారత్ ప్రపంచంలోని అతిపెద్ద 10 ఆర్థిక వ్యవస్థల నుంచి టాప్ 5 ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశంగా ఎదిగిందని ప్రధాని గుర్తుచేశారు. పదేళ్లలో భారత ఎగుమతులు రెట్టింపైనట్లు తెలిపారు.
అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధులు పెరిగిపోతున్నారని, కాని భారత్‌లో రాబోయే మూడు దశాబ్దాలపాటు యువత అధిక సంఖ్యలో ఉంటారని, ఇది దేశ అభివృద్ధికి కీలకంగా మారనుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. దేశంలో 2014లో మౌలిక రంగాలకు రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేస్తే, ప్రస్తుతం ఏటా రూ.12 లక్షల కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు గుర్తుచేశారు.
2047 వికసిత్ భారత్ లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. రాజస్థాన్ ప్రభుత్వం ద రైజింగ్ రాజస్థాన్ మీట్ ద్వారా తొలి రోజే రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులపై ఎంవోయూలు చేసుకుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్‌లాల్ తెలిపారు. కార్యక్రమంలో వందలాది మంది పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.