తమిళనాడులో మహిళలు, ఆడపిల్లలపై పాల్పడుతున్న లైంగిక నేరాల ఘటనలు వరుసగా వెలుగుచూస్తున్నాయి. చెన్నయ్, మదురై, కోయంబత్తూరు ఇలా రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసినా శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా ఉంది. డిఎంకె ప్రభుత్వ పాలనలో ఎక్కువైన నేరాల రేటు, మహిళలపై నానాటికీ పెరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి.
తాజాగా చెన్నైలో ఒక దారుణం వెలుగు చూసింది. మానసిక సమస్యలు ఉన్న 21ఏళ్ళ అమ్మాయిపై ఏడుగురు వ్యక్తులు కొంతకాలంగా పదేపదే అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఆ నిందితుల్లో ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. బాధితురాలి తండ్రి ఒక రోజుకూలీ. ఆయన తన కుమార్తె ఫోన్లో కొన్ని అభ్యంతరకరమైన ఫొటోలు చూసి అమ్మాయిని ప్రశ్నించినప్పుడు విషయం బైటకు వచ్చింది.
బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేసినా అయన్పురం పోలీసులు మొదట సరిగ్గా స్పందించలేదు. నిందితులను పట్టుకుని వారిని హెచ్చరించి వదిలేసారు. ఇకపై ఇలాంటి నేరాలు చేయబోమని నిందితులు చెప్పడంతో వారిని పోలీసులు వదిలిపెట్టేసారు. ఆ తర్వాత బాధితురాలి బంధువొకరు చింతాద్రిపేట పీఎస్‌లో మళ్ళీ ఫిర్యాదు చేయడంతో కేసులో కదలిక వచ్చింది. ఎగ్మోర్ మహిళా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసారు.
ప్రాథమిక దర్యాప్తులో తెలిసిన వివరాల ప్రకారం… బాధితురాలి క్లాస్మేట్ ద్వారా ఆమెకు గతేడాది ముగ్గురు వ్యక్తులతో పరిచయం అయింది. వారు ఆమెను చెన్నైలోని పలు ప్రాంతాలకు తీసుకువెళ్ళి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. వారిద్వారా మరో నలుగురు యువకులు కూడా బాధిత యువతిని లొంగదీసుకున్నారు. అలా కొంతకాలంగా ఆ ఏడుగురూ ఆ అమ్మాయిని లైంగికంగా దోచుకుంటున్నారు.
ఈ కేసుకు సంబంధించి మొత్తం ఏడుగురు నిందితుల్లో ఇప్పటివరకూ ఇద్దరు పట్టుబడ్డారు. బీఎస్సి చదువుతున్న 19ఏళ్ళ సురేష్‌ను, పన్నెండవ తరగతి చదువుతున్న 17ఏళ్ళ మరో విద్యార్ధిని పోలీసులు అరెస్ట్ చేసారు. మరో ఐదుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు.