ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికితోడు ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో బుధ,గురువారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం నాటికి అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి తమిళనాడు, శ్రీలంక మధ్య తీరందాటుతుందని ఐఎండి అంచనా వేసింది. దీని ప్రభావంతో వచ్చే ఆదివారం వరకు ఏపీలో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
అల్పపీడన ప్రభావంతో సోమ, మంగళవారం మోస్తరు వర్షాలు, బుధ, గురువారం భారీ వర్షాలు కురిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. దీనికితోడు ఆవర్తనం కొనసాగుతూ ఉంది. దీని ప్రభావంతో ఏపీలో అనేక ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
పంటలు నూర్పిడి వాయిదా వేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సూచించారు. నూర్పిడి చేసిన ధాన్యం తడవకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు. నూర్పిడి పనులు వాయిదా వేసుకోవాలని సూచించారు. అల్పపీడన వర్షాలు, జాగ్రత్తలపై సీఎం చంద్రబాబునాయుడు కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా ధాన్యం తడవకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.