దారుణం జరిగింది. నంద్యాల జిల్లా నందికొట్కూరులో ప్రేమించలేదని ఓ బాలికపై ఓ బాలుడు పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు. ఈ ఘటనలో బాలిక చనిపోయింది. మంటలు అంటుకోవడంతో బాలుడు గాయపడ్డారు. గాయపడిన బాలుడికి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
వెల్దుర్తి మండలం సామర్లకోటకు చెందిన బాలిక ఇంటర్ చదువుతోంది. కలుగొట్లకు చెందిన ఓ బాలుడు ప్రేమపేరుతో వెంటపడుతున్నాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు బాలికను అమ్మమ్మ ఇంటి వద్ద ఉంచారు. ఆరు నెలలుగా బాలిక అమ్మమ్మ వద్దే ఉంటోంది. గత అర్థరాత్రి బాలిక ఉంటున్న ఇంటి వద్దకు చేరుకుని తలుపు తట్టాడు. బాలిక తలుపు తీయగానే నోట్లో గుడ్డలు కుక్కి, పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. బాలిక మంటల గాయాలతో ప్రాణాలు కోల్పోయింది.
మంటలు ఇంటర్ చదువుతోన్న ఉన్మాదికి కూడా అంటుకున్నాయి. వెంటనే గడియ తీసి రోడ్డు మీదకు వచ్చాడు. ఇది గమనించిన బాలిక కుటుంబ సభ్యులు పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన బాలుడిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.